Baby Planning: బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఈ విషయాల్లో ఓ క్లారిటీకి రండి
పిల్లలను కోరుకోని వారు ఎవరుంటారు? కానీ బిడ్డకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించగలగాలి.
పెళ్లయిన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని కోరుకోవడం సహజం. ఓ ప్రాణిని ఈ లోకంలోకి తీసుకొచ్చే ముందు తల్లిదండ్రులుగా పూర్తిగా సిద్ధమవ్వాలి ఆ జంట. అంతేకాదు ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి కడా తెలుసుకోవాలి. పండంటి బిడ్డ కావాలంటే ముందుకు కొన్ని విషయాల్లో ఓ క్లారిటీకి రావాలి. తల్లిదండ్రులు ఎంత ఆరోగ్యంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడుతుంది.
తల్లిదండ్రులకు టెస్టులు
ప్రెగ్నెన్సీ కోసం సిద్ధమవుతున్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ వైద్యులను కలవాలి. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని నిర్ధారించుకోవాలి. ఇద్దిరికీ ఎలాంటి సమస్యలు లేకపోతే హ్యాపీగా పిల్లలను కనేందుకు సిద్ధమవ్వచ్చు. ఏమైనా సమస్యలు బయటపడితే వాటికి మందులు వాడి ఆరోగ్యంగా తయారయ్యాకే గర్భం దాల్చేందుకు ప్రయత్నించాలి. వైద్యులు కుటుంబచరిత్రను కూడా తెలుసుకుంటారు. బీపీ, డయాబెటిస్, థైరాయిడ్, ఒబెసిటి, మూర్ఛ వంటి సమస్యలు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే జాగ్రత్తగా ఉండేందుకు సూచనలు ఇస్తారు. భార్యభర్తలిద్దరూ దగ్గర సంబంధ కలవారు కావడం, మేనరికమైతే మాత్రం తప్పకుండా ముందుగానే వైద్యును సంప్రదించి ఆ విషయం చెప్పడం ఉత్తమం. మేనరిక సంబంధాలలో మానసిక లోపంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
మనీ ప్లానింగ్
గర్భం ధరించాక స్కానింగులు, ఇతర టెస్టులు ఎక్కువగానే ఉంటాయి. వాటి ధరలు ఆసుపత్రి స్థాయిని బట్టి ఉంటాయి. కాబట్టి ముందుగానే ఖాతాలో కొంత మొత్తాన్ని వాటి కోసం పక్కన పెట్టుకోవాలి. ఆహారం కూడా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆపిల్స్, కివీ, పాలు, పెరుగు, చికెన్, గుడ్లు, చేపలు వంటి ఆహారం అధికంగా తింటే మంచిది. కాబట్టి ఆహారపరంగా కూడా ఖర్చు కాస్త పెరుగుతుంది. అలాగే బలం కోసం కొన్ని ట్యాబ్లెట్లు, పాలల్లో కలుపుకుని తాగే పొడులు, ఇంజెక్షన్లు రాస్తుంటారు. వీటి ఖర్చు మరికాస్త అదనం.
ట్యాబ్లెట్లు...
తల్లికి కాలు నొప్పి, తల నొప్పి లాంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటే నచ్చినట్టు ట్యాబ్లెట్స్ మింగడం మంచి పద్దతి కాదు. వైద్యులను ముందుగానే ఆ విషయంలో ఏ మందులు వాడాలో తెలుసుకుని కొని పెట్టుకోవడం మంచిది.
వ్యాయామం...
తల్లి కావాలనుకుంటున్నవారు గర్భం ధరించడానికి ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారాన్ని తినాలి. సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి.
Also read: కాలేయాన్ని వేధించే డేంజరస్ వ్యాధులు ఇవే, అందరికీ అవగాహన అవసరం