Chicken Recipe: పాలక్ చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు
చికెన్ ఒకేలా వండుకుని బోరు కొట్టిందా? ఈసారి ఇలా కొత్తగా ప్రయత్నించండి.
చికెన్ వేపుడు, చికెన్ కర్రీ... ఎప్పుడూ ఇవేగా ఇంట్లో వండుకునేవి. ఓసారి కొత్తగా పాలకూర - చికెన్ కలిపి కూర వండి చూడండి. పచ్చి వాసన వస్తుందేమో అన్న భయం వద్దు. పాలకూరను బాగా ఉడికిస్తాం కనుక అలాంటి వాసనేదీ రాదు. ఈ కూరలో వచ్చే ఇగురు అన్నంలో కలుపుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మళ్లీ మళ్లీ ఈ కూరనే వండుకుని తినాలనిపిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకిలో
పాలకూర - నూటయాభై గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
నూనె - తగినంత
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - అరస్పూను
ధనియాల పొడి - అర స్పూను
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
పసుపు - అరస్పూను
కారం - ఒక టీ స్పూను
తయారీ ఇలా
1. చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలకూరను బాగా తరిగి కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక ఉల్లిపాయల తరుగు వేయాలి.
3. ఉల్లిపాయల కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. ఆ మిశ్రమం కాస్త వేగాక పసుపు వేసి బాగా కలపాలి.
5. పాలకూర వేసి బాగా కలపాలి. ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
6. పాలకూర నుంచి నీరు దిగి మళ్లీ కాసేపటికి ఇంకి పోతుంది.
7. పాలకూరలో నీళ్లు ఇంకిపోయాక చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
8. చికెన్ లోంచి కూడా నీళ్లు దిగి బాగా ఉడుకుతాయి.
9. చికెన్ దాదాపు 70 శాతం ఉడికిపోయాక అప్పుడు కారం వేయాలి.
10. కాసేపయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా చల్లి బాగా కలపాలి.
11.ఓ పావుగంట సేపు చిన్న మంట మీద పెడితే కూర బాగా ఉడుకుతుంది. నోరూరించే రంగులోకి వస్తుంది. దీని మీద ప్రత్యేకంగా కొత్తి మీర చల్లుకోనక్కర్లేదు.
12. పాలకూర వల్ల ఇగురు కూడా ఎక్కువే వస్తుంది. రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: పుతిన్‌కు సోకిన క్యాన్సర్ ఇదే, ఈ వ్యాధి వచ్చాక ఎన్నాళ్లు బతుకుతారో తెలుసా?
Also read: మూడో బిడ్డను కంటే పదకొండున్నర లక్షల రూపాయల బోనస్, ఓ కంపెనీ బంపర్ ఆఫర్