B12 Deficiency : అలసటగా, కాళ్లలో తిమ్మిర్లుగా ఉందా? విటమిన్ B12 లోపం కావచ్చు.. నిపుణులు సూచనలు, జాగ్రత్తలివే
Vitamin Deficiency : శరీరానికి విటమిన్లు అవసరం. అయితే B12 లోపం ఏర్పడితే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా రిపోర్ట్స్‌లో లోపం లేనట్లు కనిపించినా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే..

Vitamin B12 Deficiency : చాలామంది శరీరంలోని విటమిన్ B12 రిపోర్ట్ సాధారణంగా ఉంటే.. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని అనుకుంటారు. కానీ ఢిల్లీలోని అపోలో సర్జన్ డాక్టర్ అన్షుమాన్ కౌశల్ ఆ రిపోర్ట్స్ ఎప్పుడూ నిజం చెప్పవని అంటున్నారు. సోషల్ మీడియాలో ది యాంగ్రీ డాక్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈయన.. విటమిన్ B12 గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. రిపోర్ట్‌లో కొందరికి దీని రిజల్ట్స్ బాగానే వచ్చినా.. చాలామందిలో అలసట, కాళ్లలో తిమ్మిరి, మరచిపోవడం, చికాకు వంటి సమస్యలతో ఇబ్బందిపడతారని తెలిపారు.
విటమిన్ B12..
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. B12 అనేది నరాలను, ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచే, DNAని తయారు చేయడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. శరీరం దానిని తయారు చేయదు. కాబట్టి మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బలవర్థకమైన ఆహారం వంటి ఆహారం నుంచి దానిని శరీరానికి అందించాలి. ఇది పెద్దలకు రోజుకు దాదాపు 2.4 మైక్రోగ్రాముల B12 అవసరం. అయితే గర్భిణులు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు దీనికంటే ఎక్కువ అవసరం ఉంటుంది.
రిపోర్ట్ సరిగ్గానే ఉన్నా.. లోపం ఉంటుందట
డాక్టర్ కౌశల్ ఒక వీడియోలో మాట్లాడుతూ.. "నిరంతరం అలసిపోయి, మతిమరుపు, డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులను మీరు చూశారా? కానీ వారి నివేదికలో B12 సాధారణంగా వస్తుందా? ఇది ఫంక్షనల్ B12 లోపం." అని వివరించారు. ఇందులో రక్తంలో B12 ఉంటుంది. కానీ శరీర కణాలు దానిని ఉపయోగించలేవని ఆయన వివరించారు. దానికి సంబంధించి ఉదాహరణ ఇస్తూ.. "కాగితంపై B12 స్థాయి పూర్తి స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. వాస్తవానికి కణాలకు ఏమీ ఉండదు. బ్యాంకు ఖాతాలో డబ్బు ఉన్నా.. ATM కార్డు లేనట్లుగా.. చూడటానికి ధనవంతులుగా.. కానీ పేదవారిగా భావించడం." తరహాలో ఉంటుందని ఆయన అన్నారు.
View this post on Instagram
సాధారణ పరీక్షలు ఎందుకు నమ్మదగినవి కావు?
డాక్టర్ కౌశల్ ప్రకారం.. చాలా ల్యాబ్‌లు సిరమ్ B12ని మాత్రమే కొలిచి నివేదికను అందిస్తాయి. అయితే అసలు లోపం కణాల స్థాయిలో ఉంటుంది. "B12, ఫోలేట్ బాట్‌మన్-రాబిన్ లాగా పనిచేస్తాయి. DNA మరమ్మత్తు నుంచి RBCల తయారీ, న్యూరాన్‌లను రక్షించడం వరకు రెండూ కలిసి పనిచేస్తాయి. వీటిలో ఏదైనా లోపం ఉంటే.. మెదడు 'గోథమ్ మోడ్'లోకి వెళుతుంది. ఒత్తిడి, తిమ్మిరి చేతులు, కాళ్ళు, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి" అని ఆయన అన్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
డాక్టర్ కౌశల్.. కొందరు ఇప్పటికే రిస్క్ జోన్‌లో ఉన్నారని చెప్పారు. వీటిలో మెట్‌ఫార్మిన్ లేదా ఆమ్లత మందులు తీసుకునేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రెండవది వీగన్ డైట్‌లో ఉన్నవారికి, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. లక్షణాలు ఉంటూ.. నివేదిక సాధారణంగా ఉంటే.. MMA, హోమోసిస్టీన్ లేదా యాక్టివ్ B12 పరీక్ష చేయించుకోవాలని అన్నారు. "కొన్నిసార్లు దీనిని సరి చేసేందుకు మాత్రలు పనిచేయవు. అప్పుడు ఇంజెక్షన్లు అవసరం. సమస్య విటమిన్ కాదు.. శోషణ. ఫంక్షనల్ లోపం అంటే మీ కణాలు B12ని సరిగ్గా ఉపయోగించలేవు. కాబట్టి సంఖ్యలను చూడకండి. పనితీరు ముఖ్యం. మీ న్యూరాన్‌లను రక్షించుకోండి. శక్తి కోసం B12 గమ్మీస్‌పై ఆధారపడవద్దు. ఇది బయోకెమిస్ట్రీ, బాలీవుడ్ కాదు." అని ఆయన అన్నారు.
అపోలో న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ కూడా Xలో B12 లోపం గురించి ప్రస్తావించారు. అలసట, మర్చిపోవడం, బద్ధకం ఉంటాయని.. సాధారణ నివేదికలు ఎల్లప్పుడూ పూర్తి కథను చెప్పవని చెప్పారు. రక్తంలో ఉన్న B12లో ఎక్కువ భాగం విటమిన్‌ను కణానికి చేరని ఒక ప్రోటీన్‌తో ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. దీనివల్ల నివేదికలో B12 సాధారణంగా కనిపిస్తుంది. కానీ శరీరం దాని నుంచి ప్రయోజనం పొందదు. పరీక్షలు సరిగ్గా వచ్చినప్పటికీ సమస్యలు కొనసాగడానికి ఇదే కారణమని చెప్పారు.






















