బరువు తగ్గేందుకు వ్యాయామం అక్కర్లేదట, జస్ట్ ఈ మాత్ర వేసుకుంటే చాలట!
అందరి మనసులో ఒక ఆశ మాత్రం ఉంటుంది. కష్ట పడకుండా సన్నబడితే బావుణ్ణు అని. అలాంటి వారి ఆశలు తీరే రోజు దగ్గర్లోనే ఉందని నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గడం అనేదిf ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న విషయం. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు అందరూ చేస్తూనే ఉంటారు. అందరికి బరువు తగ్గి నాజూకుగా ఉండాలనే అనుకుంటారు. ఆహార నియమాలు, వ్యాయామం నచ్చేవారు ఎంతమంది? ఎలాగైనా బరువు తగ్గాలనే ఆరాటం ఉన్న వారు కొందరే ఉంటారు. అటువంటి వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే మరికొందరు నిత్యం కొత్త వ్యాయామాలు ప్రయత్నిస్తుంటారు. రకరకాలు చెమటోడ్చి అయినా సరే బరువు తగ్గాలనే అనుకుంటారు. ఇలాంటి వారు ఏదో ఒక రకంగా బరువు తగ్గుతారు. కానీ బద్దకంగా బరువు తగ్గాలని ఆలోచించే వారికే కష్టం. బరువు తగ్గాలనే వారి కల కలగానే మిగిలిపోతుంది. బరువు తగ్గడం మనవల్ల అయ్యే పనికాదు అని కూడా అనేస్తుంటారు.
అధిక బరువు, స్థూలకాయం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇది రెండో హెల్త్ బర్డెన్ అని నివేదికలు నినదిస్తున్నాయి. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వు అనేక లైఫ్ స్టయిల్ సమస్యలకు మూల కారణం అనేది జగమెరిగిన సత్యం. బరువు ఎక్కువగా ఉండేవారిలో ఎముకల నుంచి గుండె వరకు అన్ని అవయవాలు రిస్క్ లో పడిపోతాయి. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ శాస్త్రవేత్తలు సులభంగా బరువు తగ్గడం ఎలా అనే అంశం మీద పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే టెక్సాస్ కు చెందిన శాస్త్రవేత్తలు మేము కాస్త ముందున్నామని ప్రకటిస్తున్నారు.
బరువు తగ్గేందుకు మాత్ర?
బరువు తగ్గించే కొత్త చికిత్సకు సంబంధించిన ట్రయల్స్ టెక్సాస్ లో మొదలైంది. ఈ మేరకు ఇంజెక్టబుల్ ప్రొడక్ట్‌ను ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. ఈ మందు పేరు CPACC. ముందుగా కొవ్వు, కేలరీలు, షుగర్స్ ఎక్కువగా ఉన్న ఆహారం ఎలుకలకు ఇచ్చారు. తర్వాత ఆరు వారాల పాటు ప్రతి మూడు రోజులకు ఒకసారి వాటికి ఇంజక్షన్ ఇచ్చారు. ఇలా ఇంజక్షన్లు తీసుకున్న ఎలుకలు బరువు పెరగలేదు. ఈ ఎలుకలకు గుండెజబ్బులు, స్ట్రోక్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్టు గమనించారు.
ఈ పరిశోధకులు ఈ మెడిసిన్ ను మార్కెట్ లోకి తేవడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. టెక్సాస్ యూనివర్సిటి కి చెందిన ఈ పరిశోధకులు మీడియాతో మాట్లాడుతూ ఈ పరిశోధన పర్యంతం ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదని, ఇంజెక్షన్ ద్వారా వారానికి రెండు సార్లు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఎలుకల్లో లివర్, గుండె పనితీరు సాధారణంగానే ఉంది కనుక ఇప్పుడు ట్రయల్స్ లో పాల్గొనేందుకు వాలంటీర్ల కోసం చూస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఈ మెడిసిన్ లో ఉపయోగించే కీలకమైన భాగం మెగ్నీషియం ఇది కణాలలో ఉండే మైటోకాండ్రియాకు నష్టం జరగకుండా నివారిస్తుంది. ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకున్నప్పటికీ శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఉండడం ఇక్కడ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. మరి, ఈ మాత్ర పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది ఇంకా చెప్పలేదు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.