Pills With Drinks: ఈ పానీయాలతో పెయిన్‌కిల్లర్ మాత్రలు అస్సలు తీసుకోవద్దు, అలా చేస్తే..
ఈ పానీయాలతో మీరు మాత్రలను తీసుకుంటున్నారా? అయితే, మీరు ఎన్ని ఔషదాలు మింగినా ఫలితం ఉండదు. ఎందుకంటే..
చాలామందికి మాత్రలను టీ, కాఫీలు, మజ్జిగా, కూల్ డ్రింగ్స్ లేదా చల్లని నీటితో తీసుకుంటారు. అయితే, కొన్ని మాత్రలను ఆయా పానీయాలతో తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నొప్పి నివారణ మందులు(painkillers)ను ఎట్టి పరిస్థితుల్లో ఇతరాత్ర పానీయాలతో కలిపి తీసుకోకూడదు. కేవలం నీటితో మాత్రమే మాత్రలను తీసుకోవాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మాత్రలను తీసుకోవలసి వస్తే.. నీటితో మాత్రమే మింగాలి.
ఏం జరుగుతుంది?: నిపుణులు ఇటీవల ఏయే పానీయాలతో మాత్రలను తీసుకోకూడదో వివరించారు. ఆయా పానీయాలతో మాత్రలను తీసుకున్నట్లయితే.. అవి కడుపులోకి వెళ్లిన తర్వాత జీర్ణం కావడం కష్టమవుతుంది. అవి వెంటనే ఫలితం ఇవ్వలేవని, శరీరంలో కలవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని తెలిపారు. కొన్ని మాత్రలైతే.. శరీరం గ్రహించక ముందే కరిగిపోతాయన్నారు. సౌదీ ఫార్మాస్యూటికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మనం నిత్యం తీసుకొనే పానీయాలతో పెయిన్‌కిల్లర్స్, అలెర్జీ మాత్రలను తీసుకుంటే ఎలాంటి ఆటంకాలు వస్తాయో వివరించింది.
కాఫీ: నిపుణులు రెండు హాట్ కాఫీలతో ఒక ప్రయోగం చేశారు. ఒకటి 41 C, మరొకటి100 C వేడి ఉండేలా చూసుకున్నారు. ఆ రెండు కాఫీలతో మాత్రలు తీసుకున్నప్పుడు.. ఎలాంటి ప్రభావానికి గురయ్యాయో తెలుసుకున్నారు. కాఫీలో ఉండే కెఫిన్.. మందులతో కలిసినప్పుడు కొత్త సమస్యలు రావచ్చని భావించారు. కానీ, అంతకంటే ముందు కాఫీ వంటి వేడి పానీయాలు మాత్రలు విచ్ఛిన్నమయ్యే సమయంపై ప్రభావం చూపుతాయని తెలుసుకున్నారు. అంటే, వేడి వేడి కాఫీతో మాత్రలు తీసుకున్నా ఫలితం ఉండదు.
ఆరెంజ్ జ్యూస్: ఉదయాన్నే ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, మాత్రలను తీసుకోడానికి మాత్రం.. ఇది సరైన పానీయం కాదు. ఇది కూడా శరీరానికి మాత్రల్లోని సరైన డోస్ అందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి.. కేవలం ఆరెంజ్ జ్యూస్ మాత్రమే కాదు, విటమిన్-సి కలిగిన మరే జ్యూస్‌తోనూ మాత్రలను తీసుకోకూడదు.
శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్: కోకా-కోలా వంటి డింక్స్‌తో సైతం మాత్రలను తీసుకోకూడదు. ఈ డ్రింక్స్ చాలా రకాల ఔషదాల విచ్ఛిన్న సమయంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు తెలుసుకున్నారు. ముఖ్యంగా అలెర్జీ మాత్రలను కూల్ డ్రింక్స్‌తో తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌తో కూడా మాత్రలను అస్సలు తీసుకోకూడదు.
Also Read: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు
మజ్జిగ: మజ్జిగతో మాత్రలను మింగడం చాలామందికి ఉండే అలవాటు. అయితే, ఇది పాల ఉత్పత్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మందులను పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. మజ్జిగ ఔషధాల శోషణ, విచ్ఛిన్నతను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మజ్జిగతో మాత్రలను మింగే అలవాటు మానుకోండి. నీటితో మాత్రను మింగడానికి ముందు, ఆ తర్వాత కూడా పైన పేర్కొన్న ఏ పానీయాలను తీసుకోవద్దు. అప్పుడే, మీరు తీసుకున్న ఔషదం మీపై సరిగ్గా పనిచేస్తుంది. లేకపోతే.. మీ ఆరోగ్య సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు.
Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది