Snack For Heart: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు
మీ గుండె పదిలంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, చెడు చిరు తిండ్లను పక్కన పెట్టేసి వీటిని రోజూ స్నాక్స్‌గా తీసుకోండి. బోలెడంత ఆయుష్షును సొంతం చేసుకోండి.
మీకు చిరుతిళ్లు అంటే బాగా ఇష్టమా? సాయంత్రం వేళ సరదాగా స్నాక్స్ తింటూ కాలక్షేపం చేయాలని ఉందా? అయితే, మీరు ఫాస్ట్ ఫుడ్ కాకుండా.. మీ వంటింట్లోనే దొరికే ఈ సింపుల్ స్నాక్స్‌ను తినడం అలవాటు చేసుకోండి. అవి మీ గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మీ ఆయుష్షును మరింత పెంచుతాయి. ఇంతకీ ఏమిటా స్నాక్స్ అనేగా మీ సందేహం? అవి మీకు బాగా తెలిసినవే.
నట్స్ లేదా డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలామంచివని నిపుణులు చెబుతున్నారు. ఇందుల్లో శరీరానికి మేలు చేసే కొవ్వులతోపాటు అనేక ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. గత కొన్నేళ్లుగా డ్రైఫ్రూట్స్‌పై జరిపిన అధ్యయనాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. నట్స్ తినడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చని చెప్పాయి.
వాల్‌నట్‌లు, హాజెల్‌నట్‌లు, బాదంపప్పులతో సహా ప్రతిరోజూ 30 గ్రాముల నట్స్‌తో కూడిన మెడిటరేనియన్ ఆహారం గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణావకాశాలను 30 శాతం వరకు తగ్గిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. 2018లో జరిపిన పరిశోధనల్లో సుమారు 192,000 మందిపై నట్స్-గుండె ఆరోగ్యానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకున్నారు. 2020లో ఈ అధ్యయనాన్ని మళ్లీ పరిశీలించిన నిపుణులు.. ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు.
రోజుకు 15 గ్రాముల నట్స్ లేదా డ్రైఫ్రూట్స్ తినే వ్యక్తులు నాలుగు సంవత్సరాల కాలంలో చాలా తక్కువ ప్రాణాంతక హృదయ సంబంధిత ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి డేటాను విశ్లేషించారు. రోజు నట్స్ తీసుకొనే వ్యక్తులను, నట్స్ తీసుకోని వ్యక్తుల ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నట్స్ తక్కువ తీసుకొనే వ్యక్తుల్లో గుండె జబ్బులు, స్ట్రోక్స్ సమస్యలకు అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన డైటీషియన్ సియాన్ పోర్టర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “అక్రోట్‌లు గుండె ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు కనీసం30 గ్రాముల వాల్‌నట్‌లు తీసుకుంటే రక్తనాళాల స్థితిస్థాపకతపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది’’ అని తెలిపారు.
నట్స్ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహకరిస్తాయని పరిశోధకులు తెలిపారు. పెన్ స్టేట్ యూనివర్శిటీలోని నిపుణులు ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ.. వాల్‌నట్‌లను తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు గలవారిలో రక్తపోటు తగ్గుతుంది. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సమీక్షలో నట్స్‌లో ఉండే ALA (ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్) ఒక ముఖ్యమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, మరియు యాంటీఆక్సిడెంట్ అని తెలిపింది. వీటిని తరచుగా తీసుకోవడం గుండెకు మంచిదేనని వెల్లడించింది. ఇది గుండెపోటుతోపాటు మరిన్ని జబ్బుల నుంచి రక్షిస్తుందని స్పష్టం చేసింది.
2021 సంవత్సరంలో 700 మంది ఆరోగ్యవంతమైన వృద్ధులపై జరిపిన పరిశోధనలో కూడా ఈ విషయం స్పష్టమైంది. రోజూ నట్స్ తినడం వల్ల వారు బరువు పెరగకుండా, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే, ఆరోగ్యానికి మంచివనే కారణంతో అదేపనిగా వాటిని తినకూడదని, మితంగా మాత్రమే తీసుకోవాలని ఆహార నిపుణులు వెల్లడించారు.
Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది
వాల్‌నట్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ నష్టంతో పోరాడటానికి సహాయపడతాయి. అయితే, వాటిలో ఉండే చెడు కొవ్వులతో కూడా నష్టం ఉంది. దీనిపై బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ డైటీషియన్ విక్టోరియా టేలర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “జీడిపప్పు, మకాడమియా వంటి నట్స్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొవ్వు స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అప్పుడప్పుడు మాత్రమే తినండి. 30 గ్రాములు లేదా చిన్న కప్‌తో నిండినా లేదా పిడికిలిలో పట్టే అన్ని నట్స్ మాత్రమే తీసుకోవాలి. అవి సుమారు 175 కిలో కేలరీలు ఉంటాయి. బాగా కాల్చిన, ఉప్పు చల్లిన లేదా తేనెతో నింపిన డ్రైఫ్రూట్స్‌కు దూరంగా ఉండండి. సహజంగా లభించే నట్స్‌నే స్నాక్స్‌గా తీసుకోండి’’ అని తెలిపారు.
Also read: హలీమ్ హైదరాబాద్ చేరింది ఆ దేశ సైనికుల వల్లే, దాని అసలు పేరు ఇదే
గమనిక: వివిధ అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. హెల్తీ డైట్ కోసం వైద్యులు లేదా ఆహార నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.