Diabetes: మునగాకు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందా? ఎంత మోతాదులో తీసుకుంటే మేలు?
మందుల ద్వారా మాత్రమే కాదు ఆహార పదార్థాలతో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వాటిలో మునగాకు చక్కని పదార్థం.
మధుమేహులు రక్తంలో చక్కెర పెరగకుండా ఉండే ఆహారం తీసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే అవి అవయవాలను ప్రభావితం చేస్తుంది. అందుకే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది నియంత్రణలో ఉంచుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మందులతో పాటు సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. మునగాకు, మునక్కాయలు మధుమేహులకు అద్భుతమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల మునగ చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యానికి మేలే చేస్తుంది. విటమిన్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు, ఐసోథియోసైనేట్స్, టానిన్‌లతో సహా అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. హై బ్లడ్ షుగర్ తో బాధపడే వాళ్ళు తరచూ మునగాకు పొడి తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటున్నారు.
డయాబెటిస్ పై మునగాకు ప్రభావం
యాంటీ డయాబెటిక్ ఏజెంట్ గా ఇది పని చేస్తుంది. ఇన్సులిన్ చర్యని పెంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవల్స్, ఇన్సులిన్ లెవల్స్, రక్తం మొత్తంలో గ్లూకోజ్ నియంత్రణపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
అధిక రక్తపోటుకి కూడా
మధుమేహులకి మాత్రమే కాదు అధిక రక్తపోటుతో బాధపడే వారికి కూడా మునగాకు మంచి చేస్తుంది. ఇందులో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటుని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గించి రక్తపోటు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటుకి కారణమయ్యే ధమనులు గట్టి పడకుండా నిరోధించడంలో సహాయపడే సమ్మేళనాలని కలిగి ఉంటుంది.
డైలీ డైట్ లో ఎలా చేర్చుకోవాలి
మునగాకు పొడి చేసుకుని పెట్టుకోవచ్చు. దాన్ని అనేక వంటలకు జోడించుకుని తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంచెం మట్టి వాసన కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఒక టీ స్పూన్ వరకు పొడి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దీన్ని అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఉన్నాయి.
☀ స్మూతీస్, సూప్, సాస్ లో ఉపయోగించుకోవచ్చు
☀ సలాడ్ లో పైన చల్లుకుని తినొచ్చు
☀ హ్యూమస్ కి జోడించుకోవచ్చు
☀ టీ లేదా వేడి నీటిలో దీన్ని కలుపుకుని తాగొచ్చు
☀ ఇతర మసాలా దినుసులతో కలిపి దీన్ని కూడా వాడుకోవచ్చు
వీళ్ళు తినకూడదు
గర్భిణీ స్త్రీలు, వార్ఫరిన్ సమస్యలు ఉన్న వాళ్ళు మునగాకు పొడి అసలు తీసుకోకూడదు. ఒక వేళ ఇది తీసుకోవాలని అనుకుంటే మాత్రం ముందుగా వైద్యుని సలహా తీసుకున్న తర్వాత ఆహారంలో జోడించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఈ సమస్యలన్నీ దూరం!