Fertility: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!
ఒత్తిడి, జీవనశైలిలో మార్పులే కాదు ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం వల్ల కూడా సంతానోత్పత్తికి గండం ఏర్పడబోతోంది. దీనికి సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి బయటకి వచ్చింది.
వాతావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అవి స్త్రీ, పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం మీద శాశ్వత ప్రభావాన్ని చూపుతుందనే షాకింగ్ స్టడీ వెల్లడించింది. 2003-2004 లో నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటా విశ్లేషణ ప్రకారం విషపూరిత ట్యాక్సిన్స్ పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్ర, శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు వెలువడ్డాయి. ప్రతీ స్త్రీ 43 రకాల రసాయనాలకు గురవుతుంది. గర్భిణీ స్త్రీ వాటికంటే ఎక్కువే ప్రభావితమౌతుంది. కొన్ని సందర్భాల్లో ఆ రసాయనాలు పిండంలో పేరుకుపోతాయి. ఫలితంగా తల్లి కంటే పిండం ఎక్కువగా నష్టపోతుంది. ఎండోక్రైన్ డిస్‌రప్టింగ్ కెమికల్స్ (EDCలు) అనే రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
అనేక పారిశ్రామిక రసాయనాలు థైరాయిడ్ పనితీరుని ప్రభావితం చేస్తాయని మరొక పరిశోధన స్పష్టంగా తెలియజేస్తుంది. పర్యావరణ రసాయనాలు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. పెస్టిసైడ్స్ మగ వారి వీర్యం నాణ్యత, వంధ్యత్వం ప్రొస్టేట్ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని పురుగుమందులకు గురికావడం వల్ల యుక్తవయసు, రుతుక్రమం, అండోత్సర్గం, సంతానోత్పత్తి పనితీరుకి ఆటంకం కలిగిస్తాయి.
మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి?
మైక్రోప్లాస్టిక్స్ అనేవి భూసంబంధమైన, జల జీవావరణ వ్యవస్థ, ఆహార ఉత్పత్తుల్లో ఉండే కాలుష్య కారకాలు. గాలిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు శ్వాసకోశ వ్యవస్థలను చేరుకుంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, మంట, జీవక్రియ సెల్యులార్ దెబ్బతినడానికి కారణంఅవుతాయి. ప్లాస్టిక్ కణాల నుంచి వెలువడే రసాయనాలు శరీర పనితీరుని ప్రభావితం చేస్తాయి. మైక్రోప్లాస్టిక్స్ వంధ్యత్వాన్ని ప్రేరేపిస్తాయి. మీకు తెలుసా..? మైక్రోప్లాస్టిక్‌లు సాధారణంగా పండ్లు, కూరగాయలలో కనిపిస్తాయి. యాపిల్‌లో అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. 5 మిమీ కంటే తక్కువ వ్యాసం కలిగిన మైక్రోప్లాస్టిక్ కణాలు మురుగునీరు, నేల, మహాసముద్రాలు, సముద్రపు ఆహారం, తాగునీరు, టేబుల్ సాల్ట్ లో కూడా కనుగొనబడ్డాయి.
థాలేట్స్, బిస్ఫినాల్స్ పాలీ, ఫ్లోరినేటెడ్ ఆల్కైల్ పదార్ధాల వంటి రసాయనాలు సాధారణంగా రోజువారీ వినియోగ వస్తువుల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అందువల్ల తరచుగా ఈ వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదల అవుతాయి. ఇవి నీటిలోకి చేరి ఆహారాలు, పానీయాలను కలుషితం చేస్తుంది. తద్వారా పర్యావరణ, ఆరోగ్య ప్రమాదాలు రెండూ కలుగుతున్నాయి. ప్లాస్టిక్ లో ఉపయోగించే విషపూరిత రసాయనాలతో వినియోగం పురుషుల స్మెర్మ్ కౌంట్ స్థాయిలతో ముడిపడి ఉంటుందని విషయం చాలా మందికి తెలియదు. వీటి కారణంగా రాబోయే సంవత్సరాల్లో పురుషుల్లో వంధ్యత్వ కేసులు పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్య కారకాలకు గురైన వ్యక్తులలో స్పెర్మ్ నాణ్యత తగ్గినట్లు నివేదించబడింది. మైక్రోప్లాస్టిక్స్ వృషణాలలో పేరుకుపోతున్నాయి. వాటి వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, కణజాల నష్టానికి దారి తీస్తుంది. మైటోకాండ్రియా పని చేయకపోవడం వృషణాలు దెబ్బతినడం స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణాలు.
స్త్రీలలో వంధ్యత్వం
ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలు ఫుడ్ ప్యాకేజింగ్, మేకప్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు వంటి మరెన్నో ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. అవి గర్భధారణ సమయంలో పిండం కణాలను ప్రభావితం చేస్తాయి. ప్లాస్టిక్ ను మృదువుగా, ఫ్లెక్సిబుల్ గా మార్చేందుకు థాలేట్ ను ఉపయోగిస్తారు. వీటిని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులో సువాసన కోసం వాడతారు. వీటి వల్ల ఎగ్ నాణ్యత దెబ్బతింటుంది. ఫలితంగా అకస్మాత్తుగా గర్భస్రావం కావడం జరుగుతుంది.
నివారణ
సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సేంద్రీయ ఆహారాన్ని తినడం, ప్రాసెస్ చేసిన వాటిని నివారించడం అత్యవసరం. టెఫ్లాన్ లేదా ఇతర పూతలతో కుండలు, పాన్‌లు వంటి ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోవాలి. ప్లాస్టిక్ కప్పులు లేదా బాటిళ్లలో ఉంచిన నీటిని తాగవద్దు. బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజుతో చేసిన బాటిళ్లను ఎంచుకోండి. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం, వేడి చేయడం మంచిది కాదు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విషయానికి వస్తే సువాసన లేని సహజ ఉత్పత్తులు ఉపయోగించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గేందుకు ఆకలి చంపుకోవాల్సిన పని లేదు - జస్ట్ ఈ డైట్ రూల్స్ పాటిస్తే చాలు