Weird: ఒకేసారి ఆరు ఉద్యోగాలు, అయిదు కోట్ల రూపాయల సంపాదన, ఎవరీ సూపర్ మ్యాన్?
ఒక ఉద్యోగం చేయడానికే తల ప్రాణం తోకకొచ్చే రోజుల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు చేస్తున్నాడు ఓ వ్యక్తి.
ఒక ఆశ, ఒక లక్ష్యం, ఒక గమ్యం... ఇవే ఏ మనిషినైనా నడిపించేవి. అలాగే యూరోప్‌కు చెందిన ఒక కుర్రాడి లక్ష్యం ఒక్కటే 40 ఏళ్లు వచ్చేసరికి రిటైర్ అయిపోవాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అందుకే 40 ఏళ్లు రాకముందే కోట్లు సంపాదించడానికి సిద్ధమయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా ఆరు ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు. అమెరికాకు చెందిన న్యూస్ అగ్రిగేటర్, డిస్కషన్ వెబ్‌సైట్ అయిన రెడిట్‌లో తన గురించి చెప్పాడు ఆ యువకుడు. కానీ తన పేరు, ఊరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. తాను యూరోప్‌కు చెందిన వాడినని మాత్రమే బయటపెట్టాడు.
నిజంగా సూపర్ మ్యాన్...
కరోనా వైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఆ యువకుడు కూడా ఆరు ఫుల్ టైమ్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆ ఆరు ఉద్యోగాలను ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అవి పార్ట్ టైమ్ ఉద్యోగాలు అనుకునేరు, అన్నీ ఫుల్ టైమ్ ఉద్యోగాలే. ఒక ఉద్యోగం చేయడమే కష్టమై చాలా మంది పని ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ బారిన పడుతుంటే ఇతను మాత్రం హాయిగా ఆరు ఉద్యోగాలు కానిస్తున్నాడు. అందుకే ఇతడిని నెటిజన్లు సూపర్ మ్యాన్ అంటున్నారు. అతను ఐటీ పరిశ్రమలో చేస్తున్నట్టు చెప్పాడు. త్వరగా మిలియనీర్ కావాలన్న కోరికతో ఇలా ఆరు ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్పాడు. కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఒక ఉద్యోగమే చేసేవాడు. అది వచ్చాకే ఇలా మొదలుపెట్టాడు. 40 ఏళ్లకే తాను రిటైర్ అవుతానని, ఆ తరువాతి జీవితం గడపడానికి ఇప్పుడే తాను డబ్బు సంపాదించాలనుకుంటున్నట్టు తెలిపాడు.
తాను ఆరు ఉద్యోగాలు ఆరు సంస్థల్లో చేస్తున్నట్టు చెప్పాడు. పెద్దగా తాను మీటింగులకు వెళ్లనని, సోషల్ పర్సన్ కానని చెప్పాడు. అందుకే అతడి ఐడెంటిటీ బయటపడలేదనుకుంటున్నారు నెటిజన్లు. ఆరు ఉద్యోగాలు చేయడం వల్ల వర్క్ కాస్త నెమ్మదిగా చేస్తానని చెప్పుకొచ్చాడాయన. అయితే మరీ దారుణం మాత్రం కాదని, అందుకే తన ఉద్యోగాలు ఇంకా నిలిచాయని చెప్పుకొచ్చాడు. అయితే టైమ్ మేనేజ్ మెంట్ ఎలా చేసుకుంటాడో మాత్రం చెప్పలేదు. ఆరు ఉద్యోగాలు ఆరు ల్యాప్‌టాప్‌లలో చేస్తాడా? వాటిని తన చుట్టూ ఎలా అమర్చుకుంటాడు అని తెగ ఆలోచిస్తున్నారు నెటిజన్లు.
కొంతమంది నెటిజన్లు ఆరు ఉద్యోగాలు ఎలా చేస్తున్నారో చెబుతూ తమకు కొన్ని టిప్స్ చెప్పమని కోరారు. మరికొందరు అతని నైతికతను ప్రశ్నించారు. ఒకే సమయంలో బహుళ కంపెనీలకు పనిచేయడం సరికాదని కూడా కామెంట్లు చేశారు. ‘నేను ఒక ఉద్యోగం సంపాదించడానికే కష్టపడుతుంటే... ఏకంగా ఆరు ఉద్యోగాలు ఒక వ్యక్తికా?’అని ఆశ్చర్యపడుతున్నారు కొంతమంది.
Also read: ఉదయాన లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ కావచ్చు, కొత్త అధ్యయన ఫలితం
Also read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి