Dating Expenses: ‘బ్రేకప్’ బిల్లు చూసి గొల్లుమన్న ప్రియురాలు, ఈ నిబ్బా ‘పక్కా కమర్షియల్’ సుమీ!
ఆమె తల్లి అనారోగ్యంతో ఉంటే ట్రీట్మెంట్‌కు డబ్బులిచ్చాడు. ఆమె తల్లి చనిపోతే అంత్యక్రియల ఖర్చు కూడా భరించాడు. అయినాసరే, ఆమె అతడికి బ్రేకప్ చెప్పింది.
ఈ రోజుల్లో ప్రేమంటే.. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు బ్రేకప్ చెబుతారో తెలీదు. సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఫొటోలు మార్చేసినంత ఈజీగా ఈ మధ్య బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌లను మార్చేసుకుంటున్నారు. ఇక నిబ్బా, నిబ్బీల సంగతి మరీ దారుణం. అన్నట్లు నిబ్బా, నిబ్బీలంటే మీకు తెలీదు కదూ. సినిమాలు, టీవీలు, రియాల్టీ షోలను చూస్తూ.. షార్ట్స్, రీల్స్ చేస్తూ టైంపాస్ చేసేసే టీనేజర్లు. నిబ్బా అంటే అబ్బాయి. నిబ్బీ అంటే అమ్మాయి. అయితే, అందరూ వీరిలా ఉండటారని అనుకోవద్దు. వీరిలో బుద్ధిగా స్కూల్‌కు, కాలేజీలకు వెళ్లి చదువుకునే మంచి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే, నిజాయతీగా ప్రేమించే లవ్‌బర్డ్స్ కూడా ఉన్నారు. తమ ప్రేమకు సినిమా హంగులు అద్ది.. ఓవర్ యాక్షన్ చేసే కొన్ని జంటలు కూడా ఈ జాబితాలోకే వస్తారు. కాబట్టి, ఈ సబ్జెక్టులో మిమ్మల్ని మీరు ఊహించుకోవద్దు. ఎందుకంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చైనా నిబ్బా నిబ్బీల బ్రేకప్ కథ.
సాధారణంగా ప్రియుడు తన ప్రియురాలి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడు. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అమ్మాయిలు.. ప్రియుడిని ఏటీఎం కార్డులా వాడేస్తుంటారు. ప్రియుడు కూడా ఆమె నాకే సొంతమనే ఫీలింగ్‌తో అప్పులు చేసి మరీ ఆమె అవసరాలు తీర్చుతాడు. (నోట్: అమ్మాయిలంతా అలా ఉండరని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చెప్పుకొనేది ప్రేమలో నిజాయతీ చూపని లవర్స్ గురించి).
చైనాలోని షాంగైకు చెందిన ఓ యువకుడు కూడా ఇదే తరహాలో తన ప్రియురాలికి ఖర్చు పెట్టాడు. ఆమె అడిగిందల్లా కొనిచ్చాడు. అతడి నుంచి గిఫ్ట్ అందుకున్నప్పుడల్లా ఆమె అతడిపై అమితమైన ప్రేమను చూపించేది. కట్ చేస్తే.. ఓ రోజు ఆమె అతడికి బ్రేకప్ చెప్పింది. అతడి హార్ట్‌ను బ్రేక్ చేసింది. అయితే, అతడు దేవదాసులా మందు బాటిల్ పట్టుకుని.. కుక్క పిల్లను పక్కనేసుకుని సాంగ్స్ వేసుకోలేదు. ఆమె కోసం పెట్టిన ప్రతి ఖర్చును అతడు భద్రంగా ఓ డైరీలో రాసుకున్నాడు.
గతంలో కూడా అతడికి ఎవరైనా హ్యాండిచ్చారో ఏమో.. ఈమెతో ప్రేమ మొదలైన రోజు నుంచి తేదీతో సహా, ఆమెకు ఖర్చుపెట్టిన ప్రతి పైసా గురించి భద్రంగా రాసుకున్నాడు. బ్రేకప్ తర్వాత ఆ బిల్లును ఆమెకు పంపించాడు. ‘‘నీ వల్ల నేను ఆర్థికంగా నష్టపోయాను. కాబట్టి, నీ కోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి నాకు పరిహారంగా చెల్లించు’’ అంటూ 70 వేల యువాన్‌లు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.8,38,151.28) బిల్లు వేశాడు. అది చూసి ఆమె షాకైంది.
ప్రతి విషయాన్ని అతడు ఎంతో స్పష్టంగా ఆ బిల్లులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ జాబితా చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో మనం ఆ నిబ్బిదే తప్పని నిర్ణయానికి వచ్చేయకూడదు. ‘‘ఆమెకు ఖర్చుపెట్టిన ప్రతి ఒక్కటీ నిబ్బా కాగితంపై రాసుకున్నాడంటే.. అతడి ప్రేమలో నిజాయతీ ఎక్కడుంది?’’ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆమె నుంచి ఏదో ఆశించడం వల్లే కదా.. అతడు ఆమెకు ఖర్చు చేశాడు. లేకపోతే, నా దగ్గర అంత డబ్బులేదని చెప్పొచ్చు కదా.. అని పలువురు లాజిక్స్ మాట్లాడుతున్నారు. ‘‘అది నిజమే కదా సారు’’ అని అంటారా? అవును, అతడు అంత కమర్షియల్‌గా ఉండటం వల్లే ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసి ఉండవచ్చు. అడిగాడు కదా అని అతడి బిల్లును చెల్లించాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. తన ప్రియురాలి తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతడి కుటుంబమే ట్రీట్మెంట్ ఖర్చులన్నీ భరించింది. కానీ, ఫలితం లేకపోయింది. ఆమె తల్లి చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో అతడే ఆమెకు తోడుగా ఉండి అంత్యక్రియల ఖర్చులను కూడా భరించాడు. మరి, అవన్నీ ఆమె మరిచిపోయిందా? లేదా అతడు తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి చేశాడో తెలీదుగానీ.. ఆమె అతడికి బ్రేకప్ చెప్పేసింది. వీరి బ్రేకప్‌కు గల స్పష్టమైన కారణమైతే తెలీదు.
Also Read: సూపర్ మ్యాన్ సిండ్రోమ్, ఇది కూడా వ్యాధే - మీ నాన్నగారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
అతడు.. బ్రేకప్ తర్వాత ఆమెకు పంపిన బిల్లులో ఆమె తల్లి హాస్పిటల్ ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులను సైతం చేర్చాడు. ఆ మొత్తానికి తనకి తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఏదో ఒక రోజు ఆమెను బెదిరించాలనే ఈ ఖర్చుల జాబితా తయారు చేసి ఉంటాడని కొందరు, ఆమె తల్లి ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన ప్రియుడిని అలా వదిలేయడం బాగోలేదని మరికొందరు.. భిన్నవాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిందా లేదా అనేది తెలియరాలేదు.
Also Read: 11 మినిట్స్, 7 హవర్స్, త్రిపుల్ 20 - ఇవి మీ ఆయుష్సును ఏ విధంగా నిర్ణయిస్తాయో తెలుసా?