మొక్కజొన్న పీచును పడేస్తున్నారా? ఇలా టీ చేసుకోండి, ఎంతో ఆరోగ్యం
మొక్కజొన్న పీచును చాలామంది డస్ట్ బిన్ లో పడేస్తారు.
వానాకాలంలో వేడి వేడిగా ఉడికించిన మొక్కజొన్నలు తింటే ఆ రుచే వేరు. ఎంతోమందికి మొక్కజొన్న అంటే ఇష్టమే. మొక్కజొన్నతో చేసే వడలు మామూలుగా ఉండవు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మొక్కజొన్న పీచులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతోమంది పీచును ఒలిచి బయట పడేస్తారు. పైనున్న తొక్కలు తీశాక లోపల లేత పీచు ఉంటుంది. ఆ పీచును దాచుకొని టీ చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఆ పీచులో విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఆ పీచును ఒకసారి కడిగేసుకొని టీ కాచుకుంటే ఎంతో మంచిది. ఇది చేయడానికి రెండు గ్లాసుల నీటిలో ఆ పీచును వేసి బాగా మరిగించాలి. వడకట్టి ఆ నీటిని తాగేయాలి. అవసరం అనుకుంటే తేనె కలుపుకోవచ్చు. ఇదే మొక్కజొన్న పీచుతో చేసే టీ. దీన్ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీని తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రనాళంలో మంటను తగ్గిస్తాయి. దీనివల్ల మూత్రం పోసేటప్పుడు వచ్చే మంట, దురద వంటివి రావు. బ్యాక్టీరియాను కూడా ఇవి నాశనం చేస్తాయి. ముఖ్యంగా మగవారు మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగడం వల్ల ప్రొస్టేట్ గ్రంధి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష వ్యర్ధాలను కూడా ఇది బయటికి పంపుతుంది. ఈ పీచులో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ రోగులు ఈ పీచుతో చేసిన టీ ని తరచూ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు. అదుపులోనే ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే శక్తి ఇన్సులిన్ హార్మోన్ కి ఉంటుంది. ఆ ఇన్సులిన్ హార్మోన్ ను కూడా నియంత్రించే శక్తి మొక్కజొన్న పీచులో ఉంది. కాబట్టి మధుమేహ రోగులు తరచూ ఈ పీచుతో టీ కాచుకొని తాగితే ఎంతో మంచిది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పీచుతో చేసిన టీ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మొక్కజొన్న పీచు జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపిస్తుంది. అదనపు కొవ్వును కూడా కరిగించేస్తుంది. కాబట్టి ఈ పీచుతో త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడానికి మొక్కజొన్న పీచు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది కిడ్నీలో ఉండే ప్రమాదకరమైన వ్యర్ధాలను, రాళ్లను తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రపరచడంలో మొక్కజొన్న పీచు ముందుంటుంది. కాబట్టి వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఈ పీచుతో చేసిన టీ తాగడానికి ప్రయత్నించండి.
Also read: భోజనం చేశాక స్వీట్ తింటున్నారా? ఒక్క నిమిషం ఆగండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.