గ్రీన్ టీ తాగండి మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం వద్దు
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు తమ రోజూవారీ డైట్లో గ్రీన్‌టీని కూడా చేర్చుకుంటారు. అయితే కొన్ని మిస్టెక్స్ చేయడం వల్ల చెడు ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి అత్యుత్తమ ప్రయోజనాలు అందిస్తుంది. ఇది వాణిజ్య టీలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ఇది టీ వలె మనకు ప్రశాంతతను అందివ్వడంతో పాటు రిఫ్రెష్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆకు రూపంలోనూ.. టీ బ్యాగ్ రూపంలోనూ.. మాచా పౌడర్, రెడీ టూ డ్రింక్ రూపంలో మార్కెట్లలో లభ్యమవుతుంది. అయితే గ్రీన్‌టీ సరైన మార్గంలో తీసుకున్నప్పుడే దాని వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయనే విషయం మీరు తీసుకోవాలి. లేదంటే.. మీరు సైడ్ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి.. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. దీనిలో పాలీఫెనాల్స్ ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. దీనివల్ల చాలామంది ప్రజలు దాదాపు ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారు. అయితే కొందరు దీనిని తీసుకునే విషయం పట్ల సరైన అవగాహన లేక.. సరైన విధంగా గ్రీన్ టీ తీసుకోక ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారా? ఇంతకీ గ్రీన్ టీ తాగే విషయంలో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో తాగకండి.
మనం తరచుగా ఉదయాన్నే సాధారణ టీ స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటాము. అది ఆరోగ్యానికి మంచిదని భావిస్తాము. అయితే అది కరెక్ట్ కాదు. దీనిలోని టానిన్లు కడుపులో యాసిడ్లను పెంచుతాయి. దీనివల్ల ఖాళీ కడుపుతో గ్రీన్‌టీ తాగినప్పుడు కడుపులో అసౌకర్యం, వికారం కలుగుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు గ్రీన్ టీ తాగే ముందు ఏదైనా ఆహారం తినడం మంచిది.
ఎక్కువగా తాగడం..
ఆరోగ్యానికి మంచిది కదా అని చాలామంది అదే పనిగా గ్రీన్‌టీ తాగుతారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆరోగ్యానికి మంచి చేసే మెడిసన్ అయినా అధిక మోతాదులో తీసుకుంటే ఇబ్బంది కలిగిస్తుంది. గ్రీన్ టీ కూడా అంతే. పైగా దీనిని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి దీనిని మీరు రోజుకు 2-3 కప్పులకు పరిమితం చేయాలి.
రాత్రుళ్లు తాగడం..
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా దీనిలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రపోయే సమయంలో తీసుకుంటే మీకు నిద్ర దూరమవుతుంది. కాబట్టి మీరు నిద్రపోవడానికి 2 లేదా 3 గంటల ముందు మాత్రమే గ్రీన్ టీ తాగేలా చూసుకోండి.
తిన్న వెంటనే..
కొందరు తిన్నవెంటనే గ్రీన్‌టీ తాగేస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం నుంచి ఐరన్ శోషణకు ఆంటకం ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా రక్తహీనతకు దారి తీస్తుంది. కాబట్టి దీనిని తిని ఓ గంట అయిన తర్వాతే గ్రీన్ టీ తాగాలి.
మెడిసన్స్‌తో తీసుకోకండి..
కొందరు గ్రీన్‌టీతో మెడిసన్స్ వేసుకుంటూ ఉంటారు. బ్లడ్ థిన్నర్స్, యాంటి డిప్రెసెంట్స్, బ్లడ్ ప్రెజర్ వంటి మందులు గ్రీన్ టీకి వ్యతిరేక రియాక్షన్లు చూపిస్తాయి. కాబట్టి మీరు గ్రీన్ టీ ప్రారంభించే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి.
మళ్లీ ఉపయోగిస్తే..
కొందరు గ్రీన్ టీ బ్యాగ్‌లను ఒకసారి వినియోగించి పడేయకుండా అలా పక్కన పెడతారు. ఇలా చేస్తే.. గ్రీన్ టీ అలవాటు అవుతుందని భావిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల దానిలోని పోషకాలు మీరు పొందలేరు. దాని రుచికూడా పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మీరు వినియోగించిన ప్రతిసారీ కొత్త టీ బ్యాగ్‌ను తీసుకోవాలని గుర్తించుకోండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని.. మీరు గ్రీన్ టీ వినియోగించడంలో ఇలాంటి తప్పులు చేస్తే సరిచేసుకోండి.
Also Read : ఉదయాన్నే కాఫీకి బదులు ఇది తాగితే చాలా మంచిదట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.