ఉదయాన్నే కాఫీకి బదులు ఇది తాగితే చాలా మంచిదట!
మార్నింగ్ కాఫీ తాగకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుందనుకునే వారు.. కెఫీన్ వినియోగాన్ని తగ్గించాలనుకునేవారు ఉదయాన్నే ఈ హెల్తీ డ్రింక్ తో రోజును ప్రారంభించవచ్చు.
నిద్రలేచిన వెంటనే చాలా మంది బెడ్ కాఫీ, టీలు తాగుతారు. ఇవి మీకు ఎంత ఎనర్జీని ఇచ్చినా.. ఎంతో కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. అలాకాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మీ శరీరం యాక్టివ్ అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్లను అధిక స్థాయిలో కలిగి ఉన్న మార్నింగ్ డ్రింక్. ఇది మీ బరువు నిర్వహణలో, చర్మ ఆరోగ్యానికి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? కలిగే ప్రయోజానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యాంటీ ఆక్సిడెంటల్ రిచ్ డ్రింక్‌ను తయారు చేయడం చాలా తేలిక. నిమ్మకాయలను బాగా కడిగి ముక్కలుగా కోసి గోరువెచ్చని నీటిలో వేసి.. తీసుకోవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగవచ్చు. అయితే చాలామంది ఈ డ్రింక్‌లో చక్కెర వేసుకుంటారు. దీనిని వేయకపోవడమే మంచిది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఇది మీ ప్రేగులలో కదలికలు ఏర్పరిచి.. మీ గట్‌లోని టాక్సిక్ పదార్థాలను బయటకు పంపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది శరీరానికి అత్యవసరమైన ఓ డిటాక్స్ డ్రింక్.
టాక్సిన్స్ దూరం..
మానవ శరీరంలో ఎక్కువ శాతం నీటితో నిండి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే దాన్ని కెఫెన్తో నింపకుండా.. ఇలా హెల్తీ వేలో నీటిని అందిస్తే.. అది మీ శరీరానికి మేలు చేస్తుంది. తగినంత హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల సగం ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. గుండెల్లో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను సులువుగా బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల టాక్సిన్స్ వ్యవస్థ శుభ్రపడుతుంది.
బరువు తగ్గడానికి..
మీ మెటబాలిజం పెంచుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లేవారు ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల అది మీకో కిక్ స్టార్ట్ ఇస్తుంది. జీవక్రియను మెరుగుపరచి.. కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. కేవలం జీర్ణక్రియకే కాదు.. బరువు నిర్వహణలో కూడా మంచి ఫలితాలు చూపిస్తుంది. దీనిలోని సిట్రిక్ యాసిడ్లు జీవక్రియను మెరుగుపరచి.. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తక్కువ కొవ్వు మాత్రమే నిల్వ ఉండేలా హెల్ప్ చేస్తాయి. మీకు వ్యాయామం అలవాటు ఉంటే.. మీరు వేగంగా బరువు తగ్గేందుకు ఈ డ్రింక్ కచ్చితంగా హెల్ప్ చేస్తుంది.
స్కిన్, హెయిర్ కేర్..
చర్మ ఆరోగ్యంలోనూ నిమ్మ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలోని విటమిన్ సి మచ్చలను తగ్గించి.. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి కొల్లాజెన్ ట్రస్టెడ్ స్టోర్స్‌ను అందిస్తుంది. ఇది మొత్తం చర్మ, జుట్టు ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. పైగా వచ్చేది చలికాలంలో ఈ కాలంలో చర్మ, జుట్టు సంరక్షణకు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్లకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి మీ శరీరాన్ని జలుబు, ఫ్లూ వైరస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయం చేస్తాయి. ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందిచండంలో సిట్రస్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ మార్నింగ్ రోటీన్‌ను కప్పు కాఫీకి బదులుగా ఈ డ్రింక్‌కి మార్చండి.
Also Read : ఇంట్లోనే మోకాళ్ల నొప్పులకు ఇలా చెక్ పెట్టేయండి!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.