Dizziness : కళ్లు తిరగడం ప్రమాదానికి సంకేతమా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. చికిత్స, ఇంటి నివారణలు ఇవే
Dizziness Causes : అకస్మాత్తుగా తలనొప్పి రావడం, కళ్లు తిరగడం జరుగుతున్నాయా? పదే పదే ఈ సమస్య వస్తుంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. అవేంటంటే..

Lightheadedness Treatment : కళ్లు తిరగడం, సడెన్‌గా తల తిరిగినట్లు అనిపించడం వివిధ సందర్భాల్లో చాలామందికి అవుతుంది. ఎప్పుడో ఓసారి కలిగే సాధారణ అనుభవం ఇది. కానీ ఈ పరిస్థితి తీవ్రమైతే, పదేపదే వస్తూ ఉంటే.. అది సాధారణ అనుభవంగా తీసుకోకూడదని అంటున్నారు డాక్టర్ బిమల్ ఛాజేడ్. పదే పదే కళ్లు తిరగడాన్ని తీవ్రమైన సమస్యగా తీసుకోవాలని.. అస్సలు విస్మరించవద్దని సూచిస్తున్నారు. తల తిరగడం అంటే కేవలం అస్థిరంగా అనిపించడమే కాదు.. శరీరంలో ఏదో లోపం ఉందని సూచించే సంకేతం కూడా.
తల తిరిగే సమయంలో ప్రారంభ సంకేతాలు చాలా లైట్‌గా ఉంటాయి. కాబట్టి వాటిని మనం పట్టించుకోము. కానీ ప్రారంభ లక్షణాలను అర్థం చేసుకుని.. సకాలంలో సరైన చర్యలు తీసుకుంటే.. సమస్య తీవ్రత పెరగకుండా బయటపడవచ్చని చెప్తున్నారు. తల తిరగాడనికి ప్రారంభ సంకేతాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కళ్లు తిరిగే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు డాక్టర్ బిమల్.
కళ్లు తిరిగేప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలు
- తల తిరగడం లేదా తిరుగుతున్నట్లు అనిపించడం.
- బలహీనత, అలసటగా ఉండటం.
- తలలో భారంగా లేదా ఒత్తిడిగా అనిపించడం.
- వికారం లేదా వాంతులు చేసుకోవాలనిపించడం.
- దృష్టి లోపం లేదా కళ్ల ముందు మొత్తం చీకటిగా అనిపించడం.
- గుండె వేగంగా కొట్టుకోవడం లేదా హృదయ స్పందన రేటులో మార్పులు.
- సరిగ్గా వినలేకపోవడం లేదా చెవులలో శబ్దం (టినిటస్) రావడం.
ఈ సంకేతాలను కళ్లు తిరిగే ముందు శరీరం మీకు అందిస్తుంది. కాబట్టి వీటిని అస్సలు విస్మరించకండి. శరీరం మీకు ఏదో చెప్తుందని అర్థం చేసుకుని.. దానిని ఎలా దూరం చేసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
కళ్లు తిరగడానికి ప్రధాన కారణాలు
- రక్తపోటు తగ్గడం లేదా పెరిగినప్పుడు కళ్లు తిరుగుతాయి.
- డీహైడ్రేషన్ (నీటి కొరత) వల్ల కూడా ఫెయింట్ అయిపోతారు.
- రక్తంలో చక్కెర తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల కూడా కళ్లు తిరిగి పడిపోతారు.
- వంశపారంపర్య లేదా నరాల సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- వెర్టిగో సమస్య ఉన్నవారు. చెవి లోపలి సమస్యలు ఉన్నవారికి ఇది కలుగుతుంది.
- ఒత్తిడి లేదా ఆందోళన ఎక్కువగా పడుతుంటే కూడా కళ్లు తిరుగుతుంటాయి.
- నిద్రలేమి లేదా నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది.
- వివిధ రకాల మందుల దుష్ప్రభావాలు కూడా దీనికి కారణమవుతాయి.
ఈ కారణాలు గుర్తించి.. చికిత్సను తీసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ వీటిని విస్మరిస్తే మాత్రం ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందని గుర్తించుకోవాలి.
తల తిరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- కళ్లు తిరిగేప్పుడు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి కూర్చోవాలి. లేదా పడుకోవాలి.
- డీప్ బ్రీత్ తీసుకోండి. నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. విశ్రాంతి తీసుకోండి.
- శరీరానికి నీరు లేదా ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయం అందిస్తే మంచిది.
- తల తిరగడం పూర్తిగా తగ్గే వరకు ఏ పనులు చేయకండి.
- వికారంగా ఉంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే రెస్ట్ తీసుకోండి.
ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు
- ప్రతిరోజూ తగినంత నీరు శరీరానికి అందించండి.
- పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటే మంచిది.
- ఎక్కువసేపు నిలబడకండి.
- నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోండి. శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి.
- అకస్మాత్తుగా తల తిప్పడం, శరీరాన్ని కదిలించడం వంటివి చేయకూడదు.
పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. కానీ ఎక్కువసార్లు ఈ సమస్య వస్తుంటే విస్మరించకుండా కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది.






















