Winter heart attacks: శీతాకాలంలో గుండెపోటు అధికంగా వస్తుంది ఎందుకు? రిస్క్ ఇలా తగ్గించుకోండి
ఆధునిక కాలంలో గుండె పోటు కూడా సాధారణమైపోయింది. ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేకపోతున్నాం.
ఒకప్పుడు గుండె పోటు గురించి 50 దాటిన వారే ఆలోచించేవారు, భయపడేవారు. కానీ ఇప్పుడు ఇరవైలలో, ముప్పైలలో ఉన్న వారు కూడా భయపడాల్సిన పరిస్థితి. గుండె పోటు వయసుతో సంబంధం లేకుండా దాడి చేసి ప్రాణాలు తీసేస్తోంది. పాతికేళ్లు దాటిన అందరూ జాగ్రత్తపడాల్సిందే. గుండెపోటు అధికంగా వచ్చే సీజన్ కూడా ఉంది. అది శీతాకాలమే. చల్లని వాతావరణంలో ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఈ కాలంలోనే ఎందుకు ఎక్కువ?
చలికాలంలో శరీరంలోని నాడీ వ్యవస్థ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల రక్తనాళాలు ఇరుకుగా మారతాయి. దీన్ని ‘వాసోకాన్సిట్రిక్షన్’అంటారు. ఇది జరిగినప్పుడు రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు చలి వాతావరణంలో అవసరమయ్యే ఉష్ణోగ్రతను ఉండేలా చూసుకోవడం కోసం శరీరం రెట్టింపు కష్టాన్ని పడుతుంది. ఈ పనులన్నీ రక్తనాళాలపైనే తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే చల్లని వాతావరణంలో శరీరానికి ఆక్సిజన్ కూడా అధికంగా అవసరం పడుతుంది. రక్తనాళాలు సంకోచించి, గుండెకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. ఈ పరిస్థితులన్నీ గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా గుండె పోటు చరిత్ర ఉన్ వ్యక్తులకు ప్రమాదం ఎక్కువ.
రిస్క్ ఎలా తగ్గించుకోవాలి?
శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.
1. ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను నిత్యం ధరించండి. ఇంట్లో, బయటా కూడా ఈ జాగ్రత్త తీసుకోండి. చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడండి.
2. శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి. చలి వల్ల బయటకు వెళ్లలేని వారు, ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయండి. దీని వల్ల శరీరా వేడి నియంత్రణలో ఉండడంతో పాటూ, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యోగా, ధ్యానం, ఏరోబిక్ వంటివి కూడా చేస్తుండాలి.
3. ఎప్పటికప్పుడు మధుమేహం, రక్తపోటు స్థాయులను చెక్ చేసుకుంటూ ఉండండి. ఇవి గుండె పోటు అవకాశాన్ని పెంచుతాయి. వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
4. చలికాలంలో ఆకలి పెరుగుతుంది. ఎక్కువగా వేయించిన పదార్ధాలు, తీపి ఉత్పత్తులు తినాలనిపిస్తుంది. వీటిలో కొలెస్ట్రాల్, చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి తినాలనిపించినా వాటిని తినకుండా మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. మద్యం,ధూమపానాన్ని మానివేయడం మంచిది. హఠాత్తుగా మానలేం అనుకునేవాళ్లు తగ్గిస్తే మేలు.
5. చికాకుగా అనిపించడం, ఛాతీలో భారం, చెమట అధికంగా పట్టడం, భుజం నొప్పి, దవడ నొప్పి, తల తిరగడం లేదా, వికారం వంటి లక్షణాలను తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: అవిసెగింజలు తింటే ఆరోగ్యం... కానీ ఏం చేసుకుని తినాలో తెలియడం లేదా? ఇవిగో కొన్ని రెసిపీలు...
Read also: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Read also: ఆరోగ్యాన్ని వేయించుకుని తినేయకండి... వేపుడు వంటకాలతో వచ్చే రోగాలు ఇవే
Read also: పాలు, అరటిపండు ఒకేసారి తినకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి