Grape wine: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
ఆర్థరైటిస్ బాధితులను బాగా బాధించేవి కీళ్ల నొప్పులు. వాటి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించే ఆహారాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
ప్రపంచంలో రుమటాయిడ్ ఆర్ధరైటిస్ బాధితులు అధికంగానే ఉన్నారు. కూర్చుంటే నిలబడలేరు, నిలబడితే కూర్చోలేరు. ఏం చేసినా కీళ్ల నొప్పులు వేధిస్తాయి. జీవితాంతం మందులు వాడలేక వారి పడే మానసిక వేదన కూడా తక్కువేం కాదు. అందుకే వారికో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఓ అధ్యయనం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆర్ధరైటిస్ బాధితులు రోజుకో గ్లాస్ వైను తాగమని చెబుతోంది. ఈ ద్రాక్ష రసం కీళ్ల నొప్పులను తగ్గించి కొంత ఉపశమనం కలిగిస్తోందట.
అధ్యయనం ఇలా సాగింది...
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఆహారాలు అధికంగా తినడం వల్ల మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. ద్రాక్షలో ఈ గుణాలు అధికం. అధ్యయనంలో భాగంగా 24 మంది పురుషులకు (వీరందరికీ రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ఉంది) కాన్సట్రేటెడ్ ద్రాక్ష పొడిని డ్రింకులా కలిపి ఇచ్చారు. ఇది 250 గ్రాముల తాజా ద్రాక్ష పండ్లను తినడంతో సమానం. ఇలా మూడు వారాల పాటూ వారు ద్రాక్ష పొడితో చేసిన డ్రింకును తాగేలా చేశారు. ఆ తరువాత పరిశోధిస్తే వారందరిలో కీళ్ల నొప్పులు, మంట స్థాయిలు బాగా తగ్గాయి. ద్రాక్ష ఒక ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలది. దీనిలో రెస్వెరాట్రాల్, ప్రోయాంతోసైనిడిన్ వంటి మొక్కల సమ్మేళనాలు లభిస్తాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.
Read Also: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
ఈ అధ్యయనాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ లోని కింగ్ సౌద్ విశ్వవిద్యాలయంలోని ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగంలో నిర్వహించారు. కొరియాలో ఇదే అంశంపై అధ్యయనం సాగింది. అందులో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి.
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
గ్రేప్ వైన్ ఎందుకు?
కీళ్ల నొప్పులు తగ్గించడంలో ద్రాక్ష సహాయపడుతుందని అధ్యయనం తేల్చింది. అయితే అధిక సాంద్రత కలిగిన ద్రాక్ష గుణాలను పొందాలంటే గ్రేప్ వైన్ తాగడం మంచి మార్గమని చెబుతున్నారు పరిశోధకులు. రెడ్ వైన్ లో మొక్కల ఆధారిత సమ్మేళనమైన రెస్వెరాట్రాల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించే మొక్కల ఆధారిత సమ్మేళనమని ముందే చెప్పుకున్నాం కదా. అయితే రోజుకు ఒక గ్లాసు కన్నా అధికంగా తాగాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు అధ్యయనకర్తలు. గౌట్ ఆర్ధరైటిస్ ఉంటే మాత్రం వైన్ తాగకూడదని సిఫారసు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి
Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి