Tv Watching: మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ చూస్తున్నారా? తల్లిదండ్రులూ బీ అలర్ట్
పిల్లలు అతిగా టీవీ చూడటం వల్ల వారి భవిష్యత్ లో దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
స్కూల్ నుంచి రాగానే పిల్లలు వచ్చి టీవీ పెట్టుకుని కార్టూన్స్ చూస్తూ కూర్చుంటారు. తినేటప్పుడు టీవీలో బొమ్మలు చూడాలని మారాం చేస్తారు. ఈ కరోనా వల్ల పిల్లలు బయటకి వెళ్ళకుండా టీవీకే ఎక్కువ గంటలు అతుక్కుపోతున్నారు. బయటకి వెళ్లలేని పరిస్థితి వల్ల టీవీ, స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు పడిపోయారు. కానీ పిల్లలు అతిగా టీవీ చూస్తే పెద్దయ్యాక వారి ప్రవర్తనలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రోజుకి రెండు గంటలకి పైగా టీవీ చూసే పిల్లలు పెద్దయ్యాక డ్రగ్స్, గ్యాంబ్లింగ్, సిగరెట్, మద్యపానం వంటి వాటికి బానిసలుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ కి అతుక్కుపోతే యుక్తవయస్సులో జూదం అలవాటు వచ్చే అవకాశం 29 శాతం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ వర్గంలోని పిల్లలు ధూమపానానికి కూడా అలవాటు పడే అవకాశం 20 శాతం ఎక్కువగానే ఉంది. న్యూజిలాండ్ కి చెందిన పరిశోధకులు టీవీ స్క్రీన్ సమయం ఎక్కువగా గడిపే పిల్లల్లో వచ్చే మార్పుల గురించి పరిశోధనలు చేస్తారు. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే హానికరమైన వ్యసనాలకి అలవాటు పడే ప్రమాదం ఉందని చెప్పారు. శరీరంలో సహజంగా లభించే హ్యాపీ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉన్నవారు ఆందోళన రుగ్మతలతో బాధపడే వారు వ్యసనాలకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.
కోవిడ్ తర్వాత పిల్లల స్క్రీన్ టైమ్ రాకెట్ లా పెరిగిందని ఒక ప్రత్యేక అధ్యయనం వెల్లడించింది. ఆఫ్ కామ్ గణాంకాల ప్రకారం 2020 లో టీనేజ్, 35 ఏళ్ల లోపు వాళ్ళు రోజుకి సగటున నాలుగు గంటల పాటు టీవీని వీక్షించారు. దానితో పాటు మరో గంట అదనంగా యూట్యూబ్ వీడియోలు చూశారు. యూకే ప్రభుత్వం 5 ఏళ్ల లోపు పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకి ఒక గంట కంటే తక్కువ సమయం ఇవ్వాలని సిఫార్సు చేస్తుంది. మరికొంతమంది ఆరోగ్య నిపుణులు 5 నుంచి 17 ఏళ్ల వయస్సు వారి రోజువారీ స్క్రీన్ టైమ్ 2 గంటలకి పరిమితం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
అధ్యయనం ఎలా చేశారంటే?
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ ఎడిక్షన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం 1972, 73 మధ్యకాలంలోని వెయ్యి మంది పిల్లల ఆరోగ్య డేటాను పరిశీలించారు. దాదాపు 15 ఏళ్ల పాటు వారి టీవీ స్క్రీన్ టైమ్ గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇందులో పాల్గొన్న 1000 మందిలో 612 మంది రోజువారీ సిఫార్సు చేసిన రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీని వీక్షించారని పరిశోధకులు గుర్తించారు. వారిలో 37 శాతం మంది ఆల్కహాల్ వ్యసనంతో బాధపడుతున్నట్లు తేలింది. ఇక మరో 36 శాతం మంది పొగాకు వినియోగం ఎక్కువగా చేస్తుండగా, 18 శాతం మంది మాదక ద్రవ్యాలు గంజాయికి బానిసలుగా మారిపోయారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!