Fatty Liver : Intermittent Fasting చేస్తే బరువుతోపాటు కాలేయ సమస్యలు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారంటే
Intermittent Fasting Benefits : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గడంతో పాటు కాలేయ సమస్యలు కూడా దూరమవుతాయంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమంటున్నారంటే..

Intermittent Fasting for Fatty Liver : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన డైట్. ఈ డైట్ను ప్రారంభంలో కేవలం బరువు తగ్గించుకునే మార్గంగానే చూశారు. కానీ ఇది మధుమేహ నియంత్రణతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించారు. అనేక పరిశోధనలలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో.. శరీరంలో కొన్ని జీవక్రియ మార్పులు జరుగుతాయని.. ఇవి కణాలను మరమ్మత్తు చేయడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఇది కాలేయానికి కూడా ఉపయోగకరంగా భావిస్తారు. దీనిలో నిజం ఎంత? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాలేయ సమస్యలను దూరం చేస్తుందా? చూసేద్దాం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్..
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాథమిక నియమం ఏమిటంటే.. ఒక నిర్దిష్ట సమయం వరకు ఆహారం తీసుకోవడం మానేయడం. ఇలా చేయడం వల్ల శరీరం శక్తి కోసం గ్లూకోజ్ స్థానంలో కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ మార్పును జీవక్రియ మార్పు అంటారు. ఈ ప్రక్రియలో, కణాలు శరీరంలో ఆక్సీకరణ, జీవక్రియ ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. ఇది చెడు కణాలను తొలగిస్తుంది. దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రకాలు
- టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ - టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్లో 16 గంటల ఉపవాసం ఉంటుంది. కేవలం 8 గంటలలోపు ఆహారం తీసుకుంటారు.
- ఆల్టర్నేటెడ్ ఫాస్టింగ్ - ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఒక రోజు తినడం, ఒక రోజు ఉపవాసం ఉండటం. లేదా ఒక నిర్దిష్ట రోజున ఉపవాసం ఉండటం.
- మోడిఫైడ్ ఫాస్టింగ్ - మోడిఫైడ్ ఫాస్టింగ్ అంటే వారానికి 1 నుంచి 2 రోజులు కేలరీలను 20 నుంచి 25 శాతం వరకు పరిమితం చేయడం.
- ఫాస్టింగ్ మిమికింగ్ డైట్ - ఫాస్టింగ్ మిమికింగ్ డైట్ అనేది 5 రోజుల చక్రం. దీనిలో చాలా తక్కువ కేలరీల ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకుంటారు.
కాలేయ వ్యాధిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, దాని సంబంధిత వ్యాధుల్లో.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బాగా పెరుగుతుంది. అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగా ఇది మారుతుంది. ఈ సమస్య ఉంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా వాపు, ఫైబ్రోసిస్, చివరకు సిరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. దీనిని నియంత్రించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆహారం, జీవనశైలిలో మార్పులే.
అనేక పరిశోధనలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుందని.. వాపు, స్టేటోసిస్ను మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. AST, ALT వంటి కాలేయ ఎంజైమ్లు మెరుగుపడతాయి. అదనంగా బరువు, కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. 12 వారాల అధ్యయనంలో.. 5:2 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ NAFLD రోగులలో బరువు నుంచి కాలేయ ఎంజైమ్ల వరకు అనేక పారామితులను మెరుగుపడినట్లు కనుగొన్నారు.
ఆటోఫాగీ ప్రక్రియ
ఫాస్టింగ్ సమయంలో ఆటోఫాగీ ప్రారంభమవుతుంది. ఇది ఒక ప్రక్రియ. దీనిలో శరీరం చెడు కణాలు, వ్యర్థాలను శుభ్రపరుస్తుంది. కొత్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది కాలేయ కణాలను మరమ్మత్తు చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదనంగా కాలేయంలో వాపును తగ్గిస్తుంది. ఇది కాలేయ వ్యాధిని మరింత పెరిగే అవకాశాన్ని దూరం చేస్తుంది. అయితే దీనిపై ప్రారంభ అధ్యయనాల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. కాని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా కాలేయ సమస్యలు నయం కావడానికి సంబంధించిన అధ్యయనాలు తక్కువగా ఉన్నాయి. అలాగే దీర్ఘకాలిక ఫలితాలు కూడా స్పష్టంగా లేవు. అదనంగా ఇది అన్ని రకాల కాలేయ రోగులపై ఒకే ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కాబట్టి దీనిని కాలేయాన్ని నయం చేయడానికి ఖచ్చితమైన చికిత్స అనుకోకూడదు. కానీ ఫాలో అయితే మంచిదని చెప్తున్నారు.






















