Lancet Study: భారతీయులలో ఐరన్, కాల్షియం లోపం - లాన్సెట్ అధ్యయనం కీలక విషయాలు వెల్లడి
భారతీయులు ఐరన్, కాల్షియం, ఫోలేట్ లోపంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. స్త్రీలలో అయోడిన్, పురుషులలో జింక్, మెగ్నీషియం లోపం ఉన్నట్లు లాన్సెట్ నివేదిక తెలిపింది.
Indians Deficient In Iron, Calcium: భారతీయులు తగిన మోతాదులో మైక్రో న్యూట్రీన్స్ తీసుకోవడం లేదని ది లాన్సెట్ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఐరన్, కాల్షియం, ఫోలేట్‌తో పాటు బాడీకి అవసరం అయిన సూక్ష్మపోషకాలను అవసరమైన మొత్తంలో తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. దేశంలో మగవారితో పోల్చితే మహిళలు అయోడిన్ సరిగ్గా తీసుకోవడం లేదని వివరించింది. మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు జింక్, మెగ్నీషియంను తగినంత తీసుకోవడం లేదని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం మందికి పోషక లోపం
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులతో పాటు అంతర్జాతీయ బృందం కీలక అధ్యయనాన్ని నిర్వహించింది. 185 దేశాలలో ప్రజలు 15 రకాల సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచ జనాభాలో 99.3 శాతం మంది సరిపడ మైక్రో న్యూట్రీన్స్ తీసుకోవడం లేదని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తగినంత అయోడిన్, కాల్షియం, విటమిన్ E తీసుకోవడం వివరించింది. పలు దేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు అయోడిన్, B12, ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లు వివరించింది. మహిళలతో పోల్చితే ఎక్కువ మంది పురుషులు మెగ్నీషియం, విటమిన్ B6, జింక్, విటమిన్ Cని తగినంతగా తీసుకోవడం లేదని వెల్లడించింది.
10 ఏండ్ల డేటా ప్రకారం కీలక విషయాలు వెల్లడి
గత 10 సంవత్సరాలుగా చేసిన విశ్లేషణల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు లాన్సెట్ వెల్లడించింది. ప్రస్తుతం జీవన విధానంలో సమతుల ఆహారం కంటే త్వరగా తినే ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిపింది. శరీరానికి అవసరం అయిన సూక్ష్మపోషకాలు ఉన్నాయా? లేవా? అనేది పట్టించుకోవడం లేదని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, సబ్ సహారా ఆఫ్రికాలో 10 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు శరీరానికి అవసరం అయిన దానికంటే తక్కువ మొత్తంలో కాల్షియం తీసుకుంటున్నట్లు గుర్తించామన్నారు.
పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి
ప్రభుత్వాలు, ప్రజా ఆరోగ్య నిపుణులు పోషకాహారం గురించి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ వెల్లడించింది. బలవర్థకమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలాని తెలిపింది. ఆహారంతో పాటు అవసరమైన సంప్లిమెంట్లను తీసుకునేలా చేయాలని వివరించింది.
ఆరోగ్యానికి ఐరన్, కాల్షియం చాలా ముఖ్యం
మనిషి శరీరం చురుగ్గా పని చేయలంటే ఐరన్, కాల్షియం చాలా ముఖ్యం. హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. ఐరన్, కాల్షియం తక్కువ అయితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే కాల్షియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలను అందించే తాజా పండ్లు, ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పాల పదార్థాలతో కావాల్సిన కాల్షియం పొందే అవకాశం ఉందంటున్నారు. గోంగూర సహా పలు రకాల ఆకుకూరలు ఐరన్ లోపం రాకుండా కాపాడుతాయంటున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు.
Read Also: ఇదేం వైరస్ అండి బాబు.. పురుషుల మగతనానికే సవాల్ విసురుతోందిగా, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి