Liver Health: కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. వీటిని తప్పకుండా తినాలి, లేకపోతే మూల్యం తప్పదు..
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఒకే చోట పనిచేసేవారు.. తప్పకుండా తమ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చూడండి.
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. అది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా చక్కగా పనిచేస్తుంది. లేకపోతే.. అనారోగ్యాలు, దీర్ఘకాలిక రోగాలు దాడి చేస్తాయి. పైగా కాలేయం పాడైతే వెంటనే గుర్తించడం కూడా కష్టమే. పూర్తిగా పాడైన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. కాబట్టి.. పరిస్థితి చేయి దాటక ముందే మనం తగిన ఆహారం, మంచి అలవాట్లతో కాలేయాన్ని పరిరక్షించుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలో నమోదవుతున్న సాధారణ మరణాల్లో కాలేయ వ్యాధి బాధితుల సంఖ్య పదో స్థానంలో ఉంది. కరోనా వైరస్ వల్ల ఇటీవల అంతా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. అతిగా అనారోగ్యాన్ని కలిగింగే ఆహారాన్ని తీసుకుంటున్నారు. జీవనశైలిలో మార్పులు కాలేయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అవయవంపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి.
శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో ఒకటైన కాలేయం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్‌లను తీసుకోవడం వంటి అనేక విధులను నిర్వహిస్తుంది. ఇది మన శరీరం నుంచి హానికరమైన విషతుల్యాలను బయటకు పంపుతుంది. శరీరంలోని అవయవాలు పనిచేయడానికి అవసరమైన అనేక ప్రోటీన్లు, కొవ్వుల ఉత్పత్తిని నియంత్రించే బాధ్యత వహిస్తుంది. కాబట్టి.. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వెల్లుల్లి: ఇందులో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి సహకరిస్తుంది. కాలేయ ఎంజైమ్‌లు, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్, విటమిన్-సి, బి-6 కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్‌రూట్: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. సహజ డిటాక్సిఫికేషన్ ఎంజైమ్‌లను పెంచడంలో కూడా సహాయపడతాయి.
ఆకుపచ్చ కూరగాయాలు, ఆకుకూరలు: మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలను చేర్చడం తప్పనిసరి. ఎందుకంటే ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని విషతుల్యాలను, హానికరమైన రసాయనాలను తటస్తం చేయడం ద్వారా కాలేయానికి సహాయం చేస్తుంది.
బెర్రీస్: బ్లూబెర్రీస్, కోరిందకాయలు, క్రాన్బెర్రీస్‌లో పాలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడానికి సహాయపడతాయి. కణాలను చురుగ్గా ఉంచడం, వాపును తగ్గించడం ద్వారా అవి మన కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్, పొటాషియం, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. కాలేయ నిర్విషీకరణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ కలిగిన సిట్రస్ పండ్లు కాలేయాన్ని అన్ని అసమానతల నుంచి రక్షించడానికి ఔషదంగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా గుర్తుంచుకోండి: కాలేయం సక్రమంగా పనిచేయాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర తప్పనిసరి. కాలేయం పనితీరును మెరుగుపరిచే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి. కాలేయానికి సహకరించే ఆహారాలు.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. కాలేయంపై అధిక ఒత్తిడి నివారించేందుకు క్రమం తప్పకుండా పైన పేర్కొన్న ఆహారాలను తీసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. దీనికి ‘ఏబీపీ దేశం’ బాధ్యత వహించదు.