Anger Management Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!
కొన్నిసార్లు మనకు తెలియకుండానే కోపం కట్టలు తెంచుకుంటుంది. దానివల్ల చాలా చేదు అనుభవాలు సైతం ఎదురవుతాయి. అందుకే, దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి.. ఈ టిప్స్ పాటించండి.
కాదేదీ.. కోపానికి అనర్హం. అంటే కోపం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఏ కారణంతో వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి విపరీతమైన ఆగ్రహం వస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాధపడతాం. అరే మాట జారామే.. చేయిజేసుకున్నామే అని ఎంత పశ్చాతాప పడినా లాభం ఉండదు. అందుకే, దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే ఈ చిట్కాలు పాటించండి.
మాట్లాడే ముందు ఆలోచించాలి
కోపంలో మాటలు అదుపులో ఉండవు. తర్వాత కోపంలో మాట్లాడిన దానికి పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కోపంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. గొడవ జరిగినపుడు ఇద్దరూ మౌనంగా ఉండగలితే, ఉండగలిగే అవకాశం కలిపిస్తే చాలా వరకు పరిస్థితులు అదుపులో ఉంటాయి.
కోపం తగ్గిన తర్వాత మీరు చెప్పదలచుకున్నది ప్రశాంతంగా చెప్పవచ్చు. మీకు ఎందుకు కోపం వచ్చిందో ఎలాంటి పరుషమైన పదాలు లేకుండా వివరించడం అవసరం. ఎదుటి వారిని బాధపెట్టడం లేదా వారిని నియంత్రించేందుకు ప్రయత్నించకుండా ఉండడం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి.
వర్కవుట్
కోపం వల్ల కలిగే ఒత్తిడిని నివారించేందుకు వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా కోపం వస్తుంటే వేగంగా నడవడం, పరిగెత్తడం లేదా వీలైతే డాన్స్ చెయ్యడం వల్ల తిరిగి ఉల్లాసంగా ఉండొచ్చు. పని వల్ల లేదా ఇతర కార్యకలాపాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు కచ్చితంగా చిన్న బ్రేక్ తీసుకోవడం అవసరం.
సాధ్యమయ్యే సమస్యలకు పరిష్కరించాలి
మెస్సీగా ఉన్న పిల్లలగది మీకు కోపం తెప్పిస్తే సింపుల్ గా ఆ గది తలుపు మూసెయ్యండి. ఇలా కోపం వచ్చే సందర్భాల నుంచి తప్పుకోవడం మంచిది. జీవితంలో అన్నీ మన నియంత్రణలో ఉండవనే నిజాన్ని గ్రహించాలి. మన అదుపులో ఉండేవేమిటి? లేనివేమిటి అనే అవగాహన కలిగి ఉండాలి. ఈ వాస్తవిక దృక్పథం నశిస్తే పరిస్థితులు మరింత దిగజారి పోతాయి. కోపం దేనికీ పరిష్కారం కాదని మీకు మీరు గుర్తుచేసుకుంటూ ఉండండి.
నిందారోపణలు వద్దు
కోపంలో విమర్శలు చెయ్యడం, నిందారోపణలు చెయ్యడం వాతావరణాన్ని ఉద్రిక్త పరుస్తుంది. ఇంటి పని సహాయం కావాలని అనిపిస్తే అడగండి అంతే కానీ కోపంగా ఇంటి నువ్వెందుకు చెయ్యవూ వంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు.
క్షమించడం ఉత్తమం
కోపాన్ని అదిమిపెట్టి మనసులో కక్ష పెంచుకోవడం మంచిది కాదు. మీకు కోపం తెప్పించిన సంఘటనలను, వ్యక్తులను క్షమించడం వల్ల చాలా వరకు పరిస్థితులు తేలికపడతాయి. అనుబంధాలు బలోపేతం అవుతాయి.
హాస్య చతురత
హాస్యచతురత అదేనండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోపాన్నిఅదుపు చెయ్యడంలో బాగా ఉపయోగపడుతుంది. కోపం తెప్పించే సందర్భాల నుంచి బయటపడేందుకు హాస్యాన్ని ఆశ్రయించడం మంచిది.
రిలాక్సేషన్ టెక్నిక్స్
కోపంగా ఉన్నపుడు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించవచ్చు. దీర్ఘశ్వాస తీసుకోవడం, విశ్రాంతిగా ఉన్నట్టు ఊహించడం, టేక్ ఇట్ ఈజీ, ఆల్స్ వెల్ వంటి మాటలను పదేపదే చెప్పుకోవడం బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సంగీతం వినవచ్చు. కొన్ని యోగా భంగిమలు, మెడిటేషన్ మంచి ఫలితాలను ఇస్తాయి.
కోపం నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కోసారి సవాలుగా ఉంటుంది. కోపం నియంత్రణలో ఉండటం లేదన్న విషయాన్ని గుర్తిస్తే, కోపం వచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపంగా అనిపిస్తున్నా లేక మీ చుట్టు ఉన్న వారిని బాధ పెడుతున్నా నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు.
Also read : ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.