DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Hyderabad News: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేళ మందుబాబులకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మద్యం తాగితే క్యాబ్ ఎక్కాలని సూచిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే క్షణాల్లో లోపలేస్తామంటున్నారు.
DCP Vineet Interview With ABP Desam: నూతన సంవత్సర వేడుకలంటేనే ఎంజాయ్‌మెంట్. అయితే అది గీత దాటితే మాత్రం ఊచలు లెక్కపెట్టక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మఖ్యంగా డ్రగ్స్ తీసుకుంటే స్పాట్ టెస్ట్‌తో క్షణాల్లో భరతం పడతామంటూ హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ ఆంక్షలపై మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ ఏమన్నారంటే..
ABP దేశం: నూతన సంవత్సర వేడుకలంటే కుర్రకారు ఉత్సాహానికి పగ్గాలుండవు. మందుబాబుల ఆగడాలకు హద్దుండదు. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు విధించారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారు..?
డీసీపీ వీనీత్: నూతన సంవత్సవ వేడుకలకు హాజరయ్యేవారు, వేడుకల్లో పాల్గొని అక్కడ మద్యం సేవించి ఎంజాయ్ చేయొచ్చు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. త్రాగి వాహనం నడపకూడదు. మద్యం సేవించిన వారి కోసం ట్యాక్సీ అసోసియేషన్‌తో మాట్లాడి ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేశాం. కాబట్టి కచ్చితంగా మద్యం సేవించిన వారు సొంత వాహనాలు నడపకుండా ఈ సర్వీసులు ఉపయోగించుకోవాలి. అలా కాకుండా తప్ప తాగి వాహనాలు నడుపుతాం, రోడ్లపైన ప్రమాదాలకు కారణమవుతామంటే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. రోడ్లపై కేక్ కటింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తాం.
ABP దేశం: కొందరు సైలెన్సర్లు తీసేసి బక్ నడుపుతుంటారు. మరికొందరు రాంగ్ రూట్‌లో రెచ్చిపోతుంటారు. ఇలా ఇష్టానుసారం వ్యవహరించే వారికి ఏం చెప్పబోతున్నారు..?
డీసీపీ వినీత్: 21 ఏళ్ల లోపు మద్యం అమ్మకూడదు. విపరీతంగా సౌండ్ పెట్టి చుట్టుప్రక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మీరు ఎంత సౌండ్ పెట్టి వింటున్నారనే లెక్కలు ప్రక్కనపెట్టి, మీ వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు తీసుకెళ్లి లోపలేస్తాం. రాత్రి 1 గంట దాటిన తర్వాత సౌండ్ వినిపిస్తే చర్యలు తీసుకుంటాం.
ABP దేశం: డ్రగ్స్ ఎంతలా కంట్రోల్ చేసినా, అంతే స్దాయిలో కొత్త పెడ్లర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కట్టడిపై ఎటువంటి నిఘా పెట్టారు..?
డీసీపీ వినీత్: డ్రగ్స్ తీసుకున్న వారిని వేటాడేందుకు అన్ని విభాగాల నుండి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశాం. అక్కడక్కడా కొందరు బస్సులలో సైతం డ్రగ్స్ తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ప్రయాణికుల ముసుగులో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందిరిలో డ్రగ్స్ పై పూర్తి స్దాయి అవగాహాన రావాల్సిన అవసరం ఉంది. మేము ఎంత ప్రయత్నం చేసినా ప్రజల్లో మార్పు రావడం ముఖ్యం. డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ పెట్టాం. అవగాహాన వీడియోలు సైతం అందుబాటులోకి తెచ్చాం. న్యూ ఇయర్ వేడుకలను ద్రుష్టిలో పెట్టుకుని డ్రగ్స్ పై అన్ని చర్యలు తీసుకున్నాము. అన్ని కోణాల్లోనూ డ్రగ్స్ పెడ్లర్లను కంట్రోల్ చేసేందుకు చర్యలు చెప్పట్టాం.
ABP దేశం: నూతన సంవత్సర వేడకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పబ్‌లపై ఎటువంటి నిఘా ఉంటుంది..?
డీసీపీ వినీత్: నగరంలో పబ్‌లకు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనేది క్షుణ్ణంగా నిఘా పెట్టాం. పబ్ లోపల సీసీ కెమెరాల యాక్సిస్ కూడా తీసుకుంటున్నాం. స్నిప్పర్ డాగ్స్ కూడా పనిచేస్తున్నాయి. సలైవా టెస్ట్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచాము. స్పాట్ టెస్ట్ చేసి డ్రగ్స్ తీసుకున్నదీ లేనిదీ 15 నిమిషాల్లో తేల్చేస్తాం. నగరవ్యాప్తంతా డ్రగ్స్ తనిఖీలు జరుతాయి. రేవ్ పార్టీలు చేసే వాళ్లపై నిఘా ఉంది. వారిపై చట్టపరంగా చర్యలుంటాయి. రేవ్ పార్టీ సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఒకరి ఎంజాయ్‌మెంట్ మరొకరికి ఇబ్బంది లేకుండా సరదాగా ఎంజాయ్ చేసుకుంటే పోలీసులకు ఎటువంటి అభ్యంతరం లేదు.