Walking Tips: కొవ్వు కరగాలా? రోజుకు ఇన్ని గంటలు నడిస్తే చాలు
Walking Tips: నడకవ ల్ల ప్రయోజనాల గురించి ముందు తెలుసుకుందాం. రోజుకు కనీసం గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం నడుస్తే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు తగ్గుతారు.
Walking Tips: ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ నడక వల్ల గుండె జబ్బులు, అధిక బీపీ, షుగర్ వంటి వ్యాధుల ముప్పు కూడా చాలా వరకు తగ్గుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బర్న్ చేయడంలో నడక చాలా ప్రయోజకరంగా ఉంటుంది. తరచుగా నడవడం వల్ల మొత్తం శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాదు జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి.
బరువు తగ్గాలంటే వ్యాయామాలతోపాటు నడక గొప్ప మార్గం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నడక హార్మోన్లను కంట్రోల్‌లో ఉంచడంతోపాటు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ వాకింగ్ కు వెళ్లే వ్యక్తులు ఫిట్ గా ఉంటారు. నడక అనేది ఒక విధమైన ఆహ్లాదకరమైన వ్యాయామం. దీర్ఘకాలిక బరువును తగ్గించడంలో నడక సహాయపడుతుంది. సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన నడకను అలవాటు చేసుకుంటే కేలరీలను బర్న్ చేయడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలంటే ఒక వ్యక్తి ఎంత నడవాలి?
నడక అనేది బరువు తగ్గాలనుకునేవారికి ఒక వరం లాంటిది. తక్షణమే బరువు తగ్గాలనుకుంటే వాకింగే మంచి మార్గం. ఇందుకు తగినంత దూరాన్ని గానీ.. సమయాన్ని గానీ ఎంచుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి సమతుల్య ఆహారం తీసుకుని రోజుకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వాకింగ్ చేసినట్లయితే ఊహించని రీతిలో బరువు తగ్గుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి.
రోజూ గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో చురుకుగా నడిచినట్లయితే గుండె ఆరోగ్యం మెరగవ్వడంతోపాటు కొవ్వు బర్న్ అవుతుంది. బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. వారానికి కనీసం ఐదు సార్లు నడవడం లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్థిరమైన దినచర్య కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
నడక ఎంత మంచిదో..
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషాలు మితమైన శారీరక శ్రమ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17 శాతం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ 7 శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుందని కనుగొన్నారు. తల, మైలోయిడ్ లుకేమియా, మైలోమా, గ్యాస్ట్రిక్ కార్డియా క్యాన్సర్లు 14-26 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక ఊపిరితిత్తులు, కాలేయం, ఎండోమెట్రియల్, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు 3-11 శాతం తక్కువ ప్రమాదం కలిగి ఉంటుందని తెలిపారు.
వాకింగ్ వల్ల ప్రయోజనాలు..
వాకింగ్ లేదా సైక్లింగ్ వంటి శారీరక శ్రమ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది హృదయ స్పందన రేటు పెంచుతుంది. రోజుకి కనీసం 10 నిమిషాలు వ్యాయామం గుండెని ఆరోగ్యంగా ఉంచి క్యాన్సర్ల ప్రమాదాన్ని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్ళు బాగా పని చేస్తాయి. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గుతారు. నడిచేటప్పుడు చేతులు ముందుకు వెనుకకి కదిలించడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మాట్లాడుకుంటూ నడవటం మంచిది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే పార్కులో నడిస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నడుస్తూనే మధ్య మధ్యలో జాగింగ్, రన్నింగ్ చేయడం ఇంకా మంచిది.
Also Read : కొవిడ్ జెఎన్ 1 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.