(Source: ECI/ABP News/ABP Majha)
Hair and Curd: పెరుగుతో ఇలా చేస్తే జుట్టు బలంగా పెరగడం ఖాయం
జుట్టు ఊడిపోవడం, బలహీన పడడం జరుగుతున్నప్పుడు పెరుగుతో ఇలా చేయండి.
వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టును కాపాడుకునేందుకు పెరుగుతో చిన్న చిట్కాలను పాటిస్తే పొడవైన, ఒత్తైనా, ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది. పెరుగులో ఉండే పోషకాలు వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా పనిచేస్తాయి. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగుతో కొన్ని రకాల ప్యాక్స్ ఉన్నాయి. ఇవి అప్పుడప్పుడు జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నెలలో కనీసం రెండు మూడు సార్లు ఈ పెరుగు ప్యాక్‌లను జుట్టుకు ప్రయత్నించండి... మీకే అర్థమవుతుంది, పెరుగు జుట్టుకు ఎంత మేలు చేస్తుందో.
చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు పెరుగులో అర చెక్క నిమ్మరసం కలిపి నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి వేయాలి. ఈ మూడింటిని బాగా గిలకొట్టి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును వెంట్రుకల మొదళ్లకు అప్లై చేసి అరగంట పాటు వదిలేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.
కొందరికి జుట్టు జిడ్డుగా అనిపిస్తుంది. అది వెంట్రుకలు పట్టులా మెరవాలంటే అరకప్పు పెరుగులో ఒక టీ స్పూన్ తేనె వేసి ఒక స్పూన్ బాదం నూనె వేసి తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి. ముప్పావు గంట సేపు అలా వదిలేసి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జిడ్డుతనం పోయి పట్టుకురుల్లా వెంట్రుకలు మారుతాయి. అలాగే మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమంలో పెరుగును కలపాలి. ఈ పేస్టును జుట్టు మొదల నుంచి వెంట్రుకల మొత్తానికి పట్టించాలి. మాడుకు రాయాలి. అరగంట పాటు అలా వదిలేసి తర్వాత తల స్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. చివర్లు చిట్లకుండా ఉంటాయి. దువ్వినప్పుడు వెంట్రుకలు రాలిపోకుండా బలంగా మారుతాయి.
మందార ఆకులు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. జుట్టు రాలిపోతున్నప్పుడు మందార ఆకులతో చిన్న చిట్కాలను పాటించండి. కొద్దిగా మందార ఆకులను తీసుకొని పేస్టులా చేయండి. దానిలో ఉసిరి పొడి, మెంతుల పొడి కలపండి. అలాగే పెరుగు కూడా కలపండి. ఈ నాలుగింటిని చిక్కని పేస్టులా చేసి తలకు పట్టించండి. అరగంట పాటు వదిలేసి తర్వాత షాంపూతో స్నానం చేయండి. లేదా తరచూ చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. పెరుగులో మందార ఆకుల పేస్టును వేసి వారానికి కనీసం రెండు మూడు సార్లు అప్లై చేసినా కూడా జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అయితే కొంతమందికి వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేస్తే జలుబు చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారు వారానికి ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవడం మంచిది. లేకుంటే జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
Also read: పొట్టు ఉన్న పెసరపప్పును తింటే గుండె పదిలం
Also read: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.