Thyroid Dysfunction: ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ పరీక్ష తప్పక చేయించుకోవాల్సిందే...
థైరాయిడ్ సమస్యల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
థైరాయిడ్ పనిచేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మగవారిలో కన్నా ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువ. గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరుగదు. ఈ హార్మోన్లు మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపిస్తాయి. వాటి పనులను నియంత్రించడంలో సహాయపపడతాయి. థైరాయిడ్ సమస్య రావడానికి కారణం వారసత్వం కావచ్చు, లేదా అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కూడా అయ్యే అవకాశం ఉంది. మీకు కొన్ని లక్షణాల ద్వారా ధైరాయిడ్ గ్రంథి పనితీరు బాగోలేదని తెలుస్తుంది.
లక్షణాలు ఇవి...
1. బరువులో ఆకస్మిక మార్పులు కనిపించినా తేలికగా తీసుకోకండి. బరువు తగ్గినా లేదా హఠాత్తుగా పెరిగినట్టు అనిపించినా కూడా థైరాయిడ్ టెస్టు అవసరం. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడే ఇలా బరువు పెరగడం లేదా తగ్గడం కొద్ది రోజుల్లోనే జరిగిపోతుంది.
2. మహిళల్లో రుతుక్రమం సక్రమంగా ప్రతినెలా రావాలి. క్రమరాహిత్యంగా వస్తే అది థైరాయిడ్ గ్రంథి వల్ల కలిగే సమస్య కావచ్చు. అలాగే పీరియడ్స్ లో అధికంగా రక్తస్రావం అయినా కూడా అనుమానించాల్సిందే.
3. థైరాయిడ్ సరిగా పనిచేయని వారిలో జీర్ణసమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మలబద్ధకం వేధిస్తుంటే తేలికగా తీసుకోకుండా ఓసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
4. బాగా చలి వేస్తున్నా కూడా థైరాయిడ్ పనితీరును అనుమానించాల్సిందే. మీ చుట్టు పక్కన ఉన్నవారికి బాగానే ఉండి, మీకు మాత్రమే చలి వేస్తే టెస్టు తప్పదు. శరీరంలో కేలరీలు ఖర్చువుతూ వేడిని కలుగచేస్తాయి. ధైరాయిడ్ పనిచేయకపోవడం వల్ల కేలరీలు ఖర్చవ్వడంపై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు శరీరం బరువు కూడా పెరుగుతుంది. చలి కూడా అధికంగా అనిపిస్తుంది.
5. ఉదయం లేచినప్పటి నుంచి అలసటగా అనిపిస్తుంటే చాలా మంది నీరసం అని, సరిగా తినక ఇలాంటి సమస్యలు వస్తాయంటూ తేలికగా తీసుకుంటారు. కొన్ని రోజుల పాటూ నిరంతర అలసట వేధిస్తుంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వట్లేదని అర్థం. అలసటతో పాటూ బరువు పెరగడం లేదా ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి అనిపిస్తే అనుమానించాల్సిందే.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: షాకింగ్... నలుపుగా ఉన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం
Also read: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందా? ఇందులో నిజమెంత?