వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి
ఏ ఆహారమైనా అతిగా తింటే అనర్థమే తప్ప, ఆరోగ్యం ఉండదు.
కొన్ని రకాల ఆహారాలు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతాయి. వాటిని సరిగా వండకపోయినా, నాణ్యత బాగోకపోయినా ఇలా జరుగుతుంది. అంతెందుకు చికెన్ పూర్తిగా ఉడకకపోయినా ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. అంటే శరీరంలోకి చేరాక ఆహారం విషపూరితంగా మారుతుందన్నమాట. అలాగే ఇక్కడ మేము చెప్పిన ఆహారాలు మితంగా తింటే చాలా ఆరోగ్యకరమైనవి. కానీ వాటిని మితిమీరి తింటే మాత్రం విషంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తినేటప్పుడు మితంగా తినండి.
తేనె
తేనె చాలా మంచిది. జలుబు, దగ్గుల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఎన్నేళ్లు అయినా పాడవకుండా ఉంటుంది. అయితే ఈ తేనెను రోజుకు రెండు మూడు స్పూన్లు తింటే చాలు. రుచి బాగుంది కదా అని కప్పులో వేసుకుని చప్పరిస్తే సమస్యలు తప్పవు. కొన్ని సార్లు ఈ తేనె కోసం విషపూరితమైన మొక్కల పుప్పొడి నుంచి కూడా తయారై ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోకి అధికంగా విష పదార్థాలు చేరుతాయి. అందుకే తేనెను మితంగా తీసుకోవడమే మంచిది.
బాదం పప్పులు
బాదం పప్పులు రోజుకు గుప్పెడు తింటే ఎంతో బలం. అదే అధికంగా తింటే మాత్రం నష్టం తప్పదు. పచ్చి బాదం పప్పులో గ్లైకోసైడ్ అమిగ్డాలిన్ అని పిలిచే విషపదార్థం ఉంటుంది. ఇది శరీరంలో సైనైడ్ లాంటి అనేక రసాయనాలుగా విడిపోతుంది. యాభై పచ్చి బాదం పప్పులను తింటే ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు. ఈ విషపదార్థం శరీరంలో అధికంగా చేరకూడదు.
బంగాళాదుంపలు
పిల్లలకు ఎంతో ఇష్టమైన వంటకాలు బంగాళాదుంపలతో చేసే వంటకాలు. వీటితో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చెవి కోసుకుంటారు ఎంతో మంది పిల్లలు. బంగాళాదుంప వేపుడుకు కూడా అభిమానులు ఎక్కువ. అయితే బంగాళాదుంపలు పచ్చగా ఉన్నప్పుడు వాటిని తినకపోవడమే మంచిది. అలా పచ్చగా ఉన్న బంగాళాదుంపలో క్లోరోఫిల్ నిండుగా ఉంటుంది. ఇది విషపూరితమైన సోలనిన్ ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో చేరితే వాంతులు, విరేచనాలు కలుగుతాయి.
చెర్రీ పండ్లు
చెర్రీ పండ్లు మితంగా తింటే మంచిది. ఇందులో ఉండే గింజలు ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. ఈ గింజలను ఉమ్మేయాలి తప్ప పొట్టలోకి చేరనివ్వకూడదు.
జాజికాయ
మసాలా దినుసుల్లో ముఖ్యమైనది జాజికాయ. అయితే చాలా తక్కువగా ఈ పొడిని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మిరిస్టిసిన్, ఎలిమిసిన్ అనే పదార్ధాలు ఉంటాయి. ఈ రెండు శరీరంలో చేరినప్పుడు తల తిరిగినట్టు, వాంతులు, భ్రాంతులు కలగడం మొదలవుతుంది.
Also read: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి
Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.