Urine Test: మెదడులో కణితులుంటే మూత్రపరీక్షలో ఆ విషయం పసిగట్టేయచ్చు, కొత్త అధ్యయనం ఫలితం
మూత్ర పరీక్ష ద్వారా ఎన్నో రోగాల గుట్టులు బయటపడతాయి. ఇప్పుడు మరో సమస్య గురించి కూడా తెలిసే అవకాశం ఉంది.
మెదడులో కణితులు ఏర్పడడం చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. వాటిని ప్రాథమిక దశలో గుర్తించడం కూడా కష్టమే. తలనొప్పి లాంటి ప్రాథమిక లక్షణాలను చాలా మంది విస్మరిస్తారు. నిజానికి తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నప్పుడు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అయితే ఇప్పుడు మెదడులో కణితులను గుర్తించేందుకు మరో కొత్త పద్ధతి వచ్చేలా కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు మూత్ర పరీక్ష ద్వారా మెదడులో కణితులను గుర్తించవచ్చని కొత్తగా కనిపెట్టారు. మూత్ర పరీక్షను తరచూ చేయడం ద్వారా మెదడులో కణితులు ఏర్పడిన విషయాన్ని పసిగట్టవచ్చని కొన్ని పరిశోధనల ద్వారా నగోయా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.
తొలిదశలోనే...
మెదడులో కణితులు ముదిరిపోయాక కాకుండా ప్రాథమిక దశలోనే వాటి ఉనికిని పలు మార్లు మూత్ర పరీక్ష చేయడం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు. దీని వల్ల ప్రాథమిక దశలోనే చికిత్సను అందించి వారి ప్రాణాలను కాపాడగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మెదడులో కణితులు మూలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి ఈ సమస్యను తొలి దశలో గుర్తించడం కష్టమే. మాట సరిగా మాట్లాడ లేకపోవడం, కాళ్లు, చేతులు సరిగా కదప లేకపోవడం వంటివి జరిగాక వైద్యుడి దగ్గరకు వెళుతుంటారు. కానీ అప్పటికీ చికిత్స ఆలస్యమైపోతుంది.వారి జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మెదడులో పెద్ద పరిమాణంలో ఉన్న కణితులను తొలగించడం చాలా కష్టం.
ఇప్పుడు తాజా అధ్యయనం కొత్త ఆశలు రేపుతోంది. మూత్రపరీక్ష ద్వారా మెదడులో కణితులను పసిగట్టే పరిశోధనలు మరింత లోతుగా సాగుతున్నాయి. మూత్రంలో ఉండే మైక్రోఆర్ఎన్‌ఎ ద్వారా విషయాన్ని రాబట్టవచ్చని పరిశోధకుల ఆలోచన. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ ఆమ్లం. అదే ఎమ్ఆర్ఎన్ఎ ‘మెసెంజర్ రైబో న్యూక్లిక్ ఆమ్లం’. ఈ ఆమ్లాలు రక్తం మూత్రం వంటి ద్రవాల్లో సులువుగా కలిసిపోతాయి. వీటిని శరీరంలోకి పంపించడం ద్వారా పరిశోధనను మొదలుపెట్టారు. ఈ మెదుడును రక్తనాళాల ద్వారా చేరి అక్కడ్నించి తిరిగి మూత్రం ద్వారా బయటికి వస్తుంది. మూత్రాన్ని బయాప్సీ చేయడం ద్వారా అందులో మెదడు కణితుల ఆనవాళ్లను కనిపెట్టవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
లోతైన అవగాహన...
ప్రస్తుతం మన దగ్గర ఉన్న పద్దతులుతో మూత్రంలో కలిసిపోయిన ఎమ్ఆర్ఎన్ఏ ను సమర్థంగా విడదీయలేం. అందుకే దీన్ని విడదీయడం కోపం కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఇది పది కోట్ల జింక్ నానో తీగలతో సిద్ధమైంది. ఇది ఎంత సమర్థవంతంగా పరిచేస్తుందంటే ఒక మిల్లీ మీటరు మూత్రం నుంచి కూడా ఎమ్ఆర్ఎన్ఏను సేకరించగలదు. దాదాపు 97 శాతం కచ్చితత్వంతో మెదడు కణితులను గుర్తించగలదు. అయితే ఇంకా దీనిపై లోతైన అవగాహన, పరిశోధనుల అవసరమని భావిస్తున్నారు పరిశోధనలు.