డయాబెటిస్ బాధితులు ఆపిల్ తినొచ్చా? ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డయాబెటిస్ బాధితులు ఆపిల్ పండ్లను తినొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆపిల్ పండు ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
రోజుకో ఆపిల్ పండును తింటే డాక్టర్‌తో పనే ఉండదని అంటారు. మరి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆపిల్ పండును తినొచ్చా? ఆపిల్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందా? లేదా పెంచేస్తుందా? ఈ సందేహాలు చాలామందిలో ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఆపిల్ పండ్లను తినాలంటేనే ఆలోచనలో పడతారు. అయితే వారు ఎలాంటి సందేహం లేకుండా ఆపిల్‌ను తినొచ్చని ఆహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే..
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిదంటే జీవితాంతం ఉంటుంది. అనేక రోగాలకు దారితీస్తుంది. అందుకే ఆ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. ఒక వేళ వచ్చినా కలవరపడాల్సిన అవసరం లేదు. వైద్యుడి సూచనలతో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ మందులు వాడితే తప్పకుండా ఆయుష్సు పెరుగుతుంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారానికి బదులు ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే పండ్లలో ఆపిల్, బొప్పాయి వంటివి డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయి. ఆపిల్ చక్కెర స్థాయిలను పెంచేస్తుందనే కలవరం అస్సలు అవసరం లేదు.
ఆపిల్‌లోని పిండి పదార్థాలతో నష్టమే కదా?: ఆపిల్‌లో విటమిన్-సి, ఫైబర్‌తోపాటు అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైగా రుచి కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి.. తీపి తినేందుకు భాగ్యం లేదని బాధపడేవారు ఆపిల్ ద్వారా ఆ కోరిక తీర్చుకోవచ్చు. ఆపిల్‌లో నీటి శాతం కూడా ఎక్కువే. ఆపిల్ తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. పైగా ఈ పండులో క్యాలరీల శాతం కూడా తక్కువే. అయితే, ఆపిల్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కదా.. దాని వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది కదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తారు. అది కూడా నిజమే. కానీ, ఆపిల్‌లో ఉండే ఫైబర్ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఫైబర్‌తో ఎన్నో ప్రయోజనాలు: ఫైబర్ స్థాయిలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం గుండెకు కూడా మంచిదే. రక్తపోటును కూడా ఫైబర్ నియంత్రిస్తుంది. ఇవన్నీ ఆపిల్ ద్వారా కూడా లభిస్తాయి. కాబట్టి రోజుకో ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే. ఆపిల్‌లో ఇంకా పోలీఫెనోల్స్, మైక్రోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. పోలిఫెనోల్స్ పిండి పదార్థాల ప్రభావం శరీరం పడకుండా చూస్తాయి. డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి. జీర్ణ, బరువు సమస్యలకు పోలిఫెనోల్స్ సహకరిస్తాయి.
రోజుకో ఆపిల్ చాలు: ఆపిల్‌లో ఉండే చక్కెరను ఫ్రక్టోజ్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా పండ్లు, పలు కూరగాయలు, తేనెలో ఉంటుంది. ఒక ఆపిల్ పండును పూర్తిగా తిన్నట్లయితే బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలపై స్వల్ప ప్రభావం మాత్రమే పడుతుంది. ఆపిల్ తినడం మంచిది కదా అని.. అదే పనిగా తినడం కూడా అంత ఆరోగ్యకరం కాదు. డయాబెటిస్ బాధితుల్లో ఎక్కువగా ఇన్సులిన్ సమస్య తలెత్తుతుంది. అయితే, ఆపిల్‌లోని పోలీఫెనాల్స్.. ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించి ఇన్సులిన్ విడుదల చేయడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే, ఆపిల్‌ను మీ డైట్‌లో భాగంగా చేసుకోవాలంటే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.
Also Read: డయాబెటిస్.. యమ డేంజర్, ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?