High BP in Kids: పిల్లల్లోనూ హైబీపీ ఆనవాళ్లు, తేలికగా తీసుకోవద్దు
పిల్లల్లో హైబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎంతో మంది వైద్యులు చెబుతున్నారు.
పిల్లల్లోనూ హైబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబితే ఎవరూ నమ్మరు. కానీ ఇది అక్షరాలా నిజం. అధిక రక్తపోటు ఎక్కువ శాతం వచ్చేది పెద్దల్లోనే అయినా పిల్లలకూ రాదు అని ఎక్కడా చెప్పలేదు. వచ్చే అవకాశం తక్కువ అని మాత్రమే చెబుతారు ఆరోగ్యనిపుణులు. కానీ అక్కడక్కడా పిల్లల్లో కూడా హైబీపీ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. అమెరికాలోని పిల్లల్లో పది శాతం మందికి హైబీపీ ఉన్నట్టు సర్వేల్లో తేలింది. అలాగే మనదేశం విషయానికి వస్తే దాదాపు ఏడు శాతం మంది పిల్లలకు ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి గణాంకాలు. కాబట్టి పిల్లల్లో హైబీపీ రాదు అనే అపోహ వద్దు. పిల్లల్లో వచ్చే హైబీపీ గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. పిల్లల్లో వచ్చే రక్తపోటు రెండు రకాలు.
ప్రైమరీ హైపర్ టెన్షన్
ఇది చాలా వరకు ఆరేళ్లు దాటిన పిల్లల్లోనే కనిపిస్తుంది. ఇది రావడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఉండవు. వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ఉప్పు అధికంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కలగవచ్చు.
సెకండరీ హైపర్ టెన్షన్
ఆరేళ్లలోపు పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది. ఇది జబ్బులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ, రక్త నాళ సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నవారిలో ఈ రక్తపోటు కలుగుతుంది. పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న వారిలో కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ.
ఎలా కొలుస్తారు?
పిల్లలకు పెద్దలకు కొలిచినట్టు రక్తపోటు కొలవరు. ఎందుకంటే వారి చిట్టి భుజాలకు ఆ పట్టీలు సరిపోవు. అందుకేు పాదరసం లేని అనరాయిడ్ మానోమీటర్, డైనామ్యాప్ పరికరంతో రక్తపోటును కొలుస్తారు. కొందరు మాత్రం పెద్దకు కొలిచే పట్టీనే పిల్లల భుజాలకు ఎలాగోలా చుట్టేసి కొలిచేస్తుంటారు. దీని వల్ల సరైన రక్తపోటు చూపిస్తుందన్న నమ్మకం లేదు.
గుర్తించడం కష్టం
పెద్దల్లో కొన్ని లక్షణాల ద్వారా అధిక రక్తపోటును గుర్తించవచ్చు. కానీ పిల్లల్లో చాలా కష్టం. గుండె దడ, ఛాతీ నొప్పి, పడుకుని లేచాక తలనొప్పి, తిల తిప్పడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ వీటిని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పగలగాలి. కనీసం ఏడాదికి రెండు సార్లయిన పిల్లలకు రక్తపోటు పరీక్షలు చేయించడం ఉత్తమం.
చాలా వరకు పిల్లల్లో హైబీపీ కనిపించినా మందులు ఇవ్వరు. వ్యాయామం, ఉప్పు తగ్గించడం ద్వారానే బీపీని కంట్రోల్ ఉంచమని చెబుతారు. కానీ ఏదైనా జబ్బు కారణంగా హైబీపీ వస్తే మాత్రం దానికి తగిన చికిత్స ఉంటుంది.
Also read: మామూలు పెరుగు కన్నా పులిసిన పెరుగు తింటేనే లాభాలెక్కువ
Also read: మాంసాహారం అధికంగా తినేవారికి షాకింగ్ న్యూస్, డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ