Mangoes: రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తింటే జరిగే ఆరోగ్య అనార్ధాలు ఇవిగో
సహజంగా పండిన మామిడి పండ్లనే తినాలి. రసాయనాలు వేస్తే అవి అనారోగ్యాలకు కారణం అవుతాయి.
వేసవిలో మామిడిపండ్ల డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇది సీజనల్ పండు. కేవలం ఎండాకాలంలోనే లభిస్తుంది. కాబట్టి దీన్ని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొంతమంది విక్రయదారులు రసాయనాలను ఉపయోగించి మామిడిని అసహజంగా పండిస్తున్నారు. అలాంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి అనార్ధాలే తప్ప ప్రయోజనాలు ఏమీ ఉండదు. సహజంగా పండిన పండులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. రసాయనాలు వేసి పండించిన మామిడిను తినడం వల్ల పోషకాలు అందవు, సరి కదా ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను గుర్తించి వాటిని కొనక పోవడమే మంచిది.
రసాయనాలతో పండిన మామిడి పండ్లను తింటే వాంతులు, విరేచనాలు, విపరీతమైన బలహీనత, ఛాతీలో మంట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. మామిడిని పండించేందుకు వాడే రసాయనాలు మన శరీరంలో చాలా దూకుడుగా ప్రతిస్పందిస్తాయి. చర్మంపై దురదలు, పూతలు వచ్చే అవకాశం ఉంది. కంటి చూపు కూడా దెబ్బతినవచ్చు. గొంతులో ఇబ్బంది అనిపిస్తుంది. మింగడం కష్టంగా మారుతుంది. కళ్ళల్లో మంటలు, గొంతు మంట మొదలవుతుంది. శ్వాస లోపాలు, పుండ్లు పడడం, దగ్గు వంటివి కూడా కలుగుతాయి. అందుకే రసాయనాలతో పండిన మామిడిని తినకుండా నివారించడం చాలా అవసరం.
మామిడి పండ్లను తిన్న వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే అవి రసాయనాలతో పండిన పండ్లని అర్థం. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే రసాయనికంగా పండిన మామిడిని తినడం వల్ల హైపోక్సియా అనే పరిస్థితి ఏర్పడవచ్చు. హైపోక్సియా అనేది కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందకపోతే వచ్చే పరిస్థితి. రక్తంలో ఆక్సిజన్ పడిపోయినప్పుడు ఇది వస్తుంది. హైపోక్సియా వల్ల మైకం, నిద్రలేమి వంటి లక్షణాలు కలుగుతాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, కాళ్లల్లో తిమ్మిరి రావడం, రక్తపోటు పడిపోవడం వంటివి కూడా జరగవచ్చు.
ఎలాంటి రసాయనాలు వాడతారు?
మామిడి పండ్లను పండించేందుకు సాధారణంగా కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే ఈథెఫోన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు. ఈ రసాయనాలు పండ్లపై అసిటలీన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ మామిడి పండ్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే పండిపోతాయి. దీనివల్ల మామిడిలో ఉండే ఖనిజాలు, పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత మూలకాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని తింటే అనారోగ్యమే తప్ప ప్రయోజనాలు సున్నా. సహజమైన మామిడి పండ్లు చెట్టుకే పండుతాయి. వాటి నుంచి మంచి సువాసన వస్తుంది. కానీ రసాయనాలతో పండించిన పండ్ల వల్ల ఎలాంటి సువాసన ఉండదు. సీజన్ కానీ సమయంలో దొరికే మామిడి పండ్లను తినక పోవడమే మంచిది. అవన్నీ కూడా రసాయన పద్ధతుల్లో పండించినవే.
Also read: బరువు త్వరగా తగ్గాలా? పరగడుపున ఖాళీ పొట్టతో బొప్పాయిని తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.