CM Ramesh Vs Mithun: సీఎం రమేష్ టీడీపీ తరపున మాట్లాడుతున్నాడు - లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఆరోపణ - అసలేం జరిగిందంటే?
Loksabha: లోక్ సభలో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య రచ్చ జరిగింది. సీఎం రమేష్ ప్రసంగంపై మిథున్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Peddireddy Mithun Reddy accused CM Ramesh in the Lok Sabha: లోక్ సభ జీవో అవర్ లో ఆంద్రప్రదేశ్ కు చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట సీఎం రమేష్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్ల పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీ లేదన్నారు. కొన్ని వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.
ఏపీ లిక్కర్ స్కాంపై పార్లమెంట్ లో ప్రస్తావించిన సీఎం రమేష్
సీఎం రమేష్ ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలోనే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఎం రమేష్ సీఎం రమేశ్ బీజేపీ కోసం పనిచేయడం లేదు టీడీపీకి పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే కాంట్రాక్టుల కోసం ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన అన్ని స్కాముల కన్నా మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని ఆరోపించారు.
జీరో అవర్‌లో రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్న ఎంపీలు
జీరో అవర్ ను ఈ ఇద్దరు ఎంపీలు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు వినియోగించుకుంటున్నారు. సాధారణంగా జీరో అవర్ లో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తారు. ఇవి రికార్డుల్లోకి వెళ్తాయి. కేంద్రం స్పందిస్తుంది. చాలా మంది తమకు లభించే అవకాశాన్ని సద్వనియోగం చేసుకుంటారు కానీ . ఏపీ అంశంలో మాత్రం రాజకీయాలు దుమారం రేపుతూ ఉంటాయి. ఏపీలో లిక్కర్ స్కాం అంశంపై విచారణ గతంలోసీఐడీ ఆధ్వర్యంలో సాగింది. పలు చోట్ల సోదాలు చేసి కీలక విషయాలు కనిపెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ దర్యాప్తు బృందంలో నగదు లావాదేవీలు నిర్వహించి.. ఎక్కడెక్కిడికి తరలించారు.. అంతిమ లబ్దిదారు ఎవరో కూడా కనిపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ పార్లమెంట్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిపై ఆరోపణలు
మరో వైపు మిథున్ రెడ్డి పై కూడా ఈ స్కాంలో ఆరోపణలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి ఎంపీ అయితే లిక్కర్ వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుందని జగన్ కూడా ఇటీవల ప్రెస్మీట్ లో ప్రశ్నించారు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన పార్లమెంట్ లో డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్కాం జరగలేదని చెప్పడానికి బదులు ఎప్పటిదో అయిన మార్గదర్శి అంశాన్ని ప్రస్తావించడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ వేదికగా మరోసారి సీఎం రమేష్, మిథున్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

