Sleeping Outside: ఆరుబయట నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? డోన్ట్ మిస్!
ఉక్కపోత భరించలేక ఆరుబయట పడుకునే వారు కానీ అదే ఆరోగ్యానికి మంచిదని కొత్తగా అధ్యయనాలు జరిపి రుజువులు చూపుతున్నారు శాస్త్రవేత్తలు.
ఆరు బయట నిద్రపోవడం చాలామందికి ఇష్టం. ఎంత మంచి జ్ఞాపకమో అంటూ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లిపోతారు కూడా. అప్పట్లో మేము అని కథలుగా చెప్పే నడివయస్కులు మీకూ తెలిసే ఉంటారు. ఇప్పుడంటే అంతా ఏసి రూములకు అలవాటయ్యారు. కానీ ఇది వరకు వేసవి వచ్చిందంటే అందరూ ఆరుబయటో, డాబామీదో పడుకునేవారు. నీలాకాశం చూస్తూ నిద్రపోయే అదృష్టం ఈ జెనరేషన్ జనాలకు లేదు మరి. అప్పుడు ఉక్కపోత భరించలేక ఆరుబయట పడుకునే వారు. కానీ అదే ఆరోగ్యానికి మంచిదని కొత్తగా అధ్యయనాలు జరిపి రుజువులు చూపుతున్నారు శాస్త్రవేత్తలు.
ఏ సంఘటన బాధించి డిప్రెషన్ వచ్చేసినా కాసేపలా బయట పడుకుని ఆకాశం వంక చూడమని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలా ఆరుబయట గడపడం మనసుకు ఉల్లాసం, శరీరానికి ఆరోగ్యం ఇస్తుందట. ఈ అపార్టుమెంటుల్లో ఆరు బయటకెక్కడికి వెళ్లేదీ అనకండి. సరదాగా అప్పుడప్పుడు కాంపింగులకైనా వెళ్లాలని సలహా ఇస్తున్నారు ఎక్స్ పర్ట్స్.
ఆరుబయట నిద్రపోతే సర్కాడియన్ రిథమ్ సమయం రెండు గంటలు వెనక్కి వెళ్లిందని ఈ మధ్యే జరిపిన ఒక అధ్యయనం ద్వారా నిరూపితమైందట. అంటే మీరు రెండు గంటల ముందుగానే నిద్ర లేచేస్తారన్న మాట. సర్కాడియన్ రీసెట్ అనేది శరీరం అలవాటు పడిన నిద్రా చక్రాన్ని మార్చడమని అర్థం. ఈ సర్కాడియన్ రిథమ్ మీద కాంతి, ఉష్ణోగ్రత వంటి రకరకాల కారణాలు ప్రభావం చూపుతాయి.
ప్రస్తుతం మన చుట్టూ పరిసరాల్లో అంతులేనంత ఆర్టిఫిషియల్ లైట్ ఉంది. ఆరుబయట సమయం గడపడం అంటే ఈ ఆర్టిఫిషియల్ లైట్ కి దూరంగా ఉండడం అని అర్థం. ఇంట్లో బెడ్ రూమ్ లో ఒక్కరే పడుకుంటారు. లేదా ఇద్దరుంటారు. అందులో ఒకరు నిద్ర పోవడమో లేక ఎవరి ఫోన్లు వారు చూస్తుండటమో చేస్తుంటారు. ఇలా కాకుండా ఆరుబయట బృందంగా అప్పుడప్పుడు పడుకుంటే కబుర్లలో సమయం గడుస్తుంది. తెలియకుండానే కన్నుమలిగి ప్రయత్నం లేకుండానే నిద్ర పట్టేస్తుంది. ఇది మనస్సు, శరీరం రెండూ రెజువనేట్ అయ్యేందుకు ఒక మంచి అవకాశమని అద్యయనాలు చెబుతున్నాయి.
ఒత్తిడి లేని జీవితాలు ఈ రోజుల్లో అంత సులభం కాదు. రోజులో దాదాపుగా 8,10 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడిలో నే సగం జనాభా బతికేస్తున్నారు. ఇది నాడీవ్యవస్థ మీద, మెదడు పనితీరు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. అనుక్షణం ఏదో ఒక యంత్ర శబ్ధంలోనే సమయం గడుపుతున్నాం మనం. అలాకాకుండా ప్రకృతిలోని సహజమైన శబ్ధాల నడుమ, బహిరంగ ప్రదేశాల్లో గడిపినపుడు మన శరీరంలో కార్టిసాల్ స్థాయి గణనీయంగా తగ్గడాన్ని గమనించారట. జర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ లో చెట్లను చూస్తే ఒత్తిడి తగ్గడాన్ని గుర్తించినట్లు ఒక అధ్యయన ఫలితాలుగా ప్రచురించారు.
అర్థరాత్రి వీచే చల్లని గాలిని ఏ ఏసి గాలితోనూ పోల్చలేము. ఇలా ఆరుబయట గడిపే సమయం చాలా మంచిదని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుందని పరిశోధనలు పునరుద్ఘాటిస్తున్నాయి. అందుకే వేసవిలో ఒక వారం పాటు అలా ఊరెళ్లి ఆరుబయట పడుకోవడం బెటర్. లేదంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు కూడాను.
Also Read: డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లు తినొచ్చట - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి