(Source: ECI/ABP News/ABP Majha)
Mango: డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లు తినొచ్చట - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. వాటిని తినకుండా ఎవరూ ఆగలేరు. మరి మధుమేహుల సంగతి ఏంటి వాళ్ళు తినొచ్చా?
వేసవిలో అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసం. జ్యూసీగా టేస్టీగా ఉండే మామిడి పండ్లు ఈ సీజన్లో విరివిగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా దీని గురించి చెప్తారు. సహజ చక్కెరని కలిగి ఉన్న మామిడి పండ్లు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు, బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు తినాలంటే ఆలోచిస్తారు. కానీ మధుమేహులు ఈ పండు తినొచ్చని చెప్తున్నారు. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి.
మధుమేహులకు మంచిదేనా?
డయాబెటిస్ ఉన్న వాళ్ళు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మామిడి పండ్లు రకం, పక్వతను బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. సాధారణంగా పండిన మామిడి పండు ఎక్కువ GI కలిగి ఉంటుంది. మామిడి GI 41-60 మధ్య ఉంటుంది. మామిడిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలపై మితమైన ప్రభావాన్ని చూపుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ లెవల్స్ చూసుకుంటూ మామిడి పండు పరిమాణం ఆధారంగా వాటిని తినాలి. వీటిని పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఆకుకూరలు, వెనిగ్రేట్ డ్రస్సింగ్ తో కూడిన సలాడ్ లో మామిడి పండ్లు చేర్చుకోవడం ఉత్తమం. మామిడి పండు రసం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి అదనపు చక్కెరను కలిగి ఉంటాయి.
తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ వాళ్ళు మామిడి పండు తినేటప్పుడు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.
☀ మామిడి పండ్లను తక్కువ పరిమాణంలో తినాలి. అర కప్పు లేదా ఒక చిన్న కప్పు వరకు పరిమితం చేయాలి
☀ తక్కువ GI ఉన్న మామిడిని ఎంచుకోవాలి.
☀ రక్తప్రవాహంలో చక్కెర శోషణ మండించేలా చేసేందుకు ప్రోటీన్ లేదా ఫైబర్ నిండిన మామిడిని తినాలి.
☀ పట్టుకున్నప్పుడు గట్టిగా, తీపి వాసన కలిగిన పండిన మామిడి పండ్లను ఎంచుకుంటే మంచిది.
☀ మామిడి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయకూడనివి
☀ మామిడి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల వాటిని పెద్ద మొత్తంలో తీసుకోకూడదు.
☀ మామిడి రసానికి దూరంగా ఉండాలి
☀ ఇప్పటికే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న భోజనంతో పాటు మామిడి పండ్లు తీసుకుంటుంటే మాత్రం మానుకోండి.
☀ ద్రాక్ష, అరటిపండ్లు, చెర్రీస్ వంటి అధిక చక్కెర కలిగిన ఇతర పండ్లతో పాటు మామిడి పండ్లు తినొద్దు
☀ ప్రీ డయాబెటిక్ రోగులు అయితే రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించుకోవడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనాలి. భోజనం ఎప్పుడూ దాటవేయకూడదు. అలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారి తీస్తుంది.
ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు?
ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తీసుకుంటే సురక్షితంగా ఉంటారనేది తెలుసుకోవాలి. మామిడి పండ్ల సంఖ్యకి నిర్ధిష్ట పరిమితి లేదు. వయస్సు, బరువు, శారీరక శ్రమ, మొత్తం ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. సహజమైన చక్కెరలు, కేలరీలు అధికంగా ఉన్నందున రోజుకి 1-2 మీడియం సైజు మామిడి పండ్లు తీసుకోవడం మంచిది. ఎక్కువగా తింటే బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మెటబాలిజం మెరుగుపరిచే గ్రీన్ జ్యూస్ - ఇంట్లోనే సింపుల్ గా ఇలా చేసేసుకోండి