Heart Attack : మగ, ఆడవారిలో గుండెపోటు లక్షణాల్లో తేడాలివే.. అందుకే వారిలో డెత్ రేట్ ఎక్కువట
Heart Attack Risk Differences : మహిళల్లో గుండెనొప్పి లక్షణాలు..మగవాళ్లలో గుండెనొప్పి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. అవేంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Heart Attack Symptoms in Men vs Women : గుండెపోటు అంటే అందరికీ ఒకేలా ఉంటుందని అనుకుంటారు. కానీ మీకు తెలుసా? మగవారిలో, ఆడవారిలో ఇవి భిన్నంగా ఉంటాయట. కొన్నిసార్లు ఆ తేడా గుర్తించకపోవడం వల్లే డెత్ రేట్ పెరుగుతుందని మణిపాల్ హాస్పటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ తెలిపారు. ఇంతకీ మగ, ఆడవారికి గుండెపోటు ఎలా వస్తుంది. లక్షణాల్లోని తేడాలు ఏంటో.. డాక్టర్ సందీప్ ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం.
మగవాళ్లలో వచ్చే గుండెపోటు లక్షణాలు
"మగవారిలో సాధారణంగా అందరికీ తెలిసినట్లు ఛాతీ భాగంలో నొప్పి (Typical Cheast Pain) ఎక్కువగా వస్తుంది. ఛాతీలో బరువుగా ఉండడం, నొక్కిపెట్టేసినట్టు ఉండడం.. కాసేపు తగ్గినట్లు అనిపించినా.. సబ్లింగవస్ ఆర్బిట్ టాబ్లెట్లు నాలుక కింద పెట్టుకున్నా కొంచెం నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. చేతులు లాగడం కూడా క్లాసికల్ లక్షణాల్లో భాగమే"నని తెలిపారు సందీప్. అయితే మగవారు ఎమోషనల్గా ఒత్తిడికి గురైనప్పుడు ఇది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఆడవారిలో గుండెపోటు లక్షణాలు..
"ఆడవారిలో కూడా గుండెపోటు లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ చాలాసార్లు అది ఎటిపికల్ సింప్టమ్స్ లేదా చిన్న లక్షణాలతో వస్తుంది. వీటి గురించి అవగాహన లేకపోవడం వల్ల వాటిని పట్టించుకోరు. ఇలా లేట్ చేయడం వల్ల గుండెపోటును గుర్తించడం లేట్ అవుతుంది." అని తెలిపారు.
ఎటిపికల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. "బాగా అలసటగా ఉన్నప్పుడు లేదా బాగా ఎమోషనల్గా వీక్ అయినప్పుడు ఏ పని చేయడానికి ఇష్టపడరు. లేక నీరసంగా ఉంటారు. ఇది ఎక్కువరోజులు కొనసాగుతుంది. ఆ లక్షణాలు నార్మల్వే అనుకుని పెద్దగా పట్టించుకోరు. వెన్నుపూసలో కానీ, మెడలో కానీ, దవడలో కానీ నొప్పిరావడం, కళ్లు తిరగడం, వికారంగా ఉండడం, ఆహారం అరిగినట్లు అనిపించకపోవడం, చెమటలు పట్టేయడం వంటి లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి" అన్నారు.
అయితే ఈ లక్షణాలు అన్ని.. వయసు ప్రభావం వల్ల, పని ఒత్తిడి వల్ల, గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చాయనుకుని పట్టించుకోరు. కానీ.. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నారు సందీప్. షుగర్, బీపీ ఉన్నవారికి ఈ లక్షణాలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేకుంటే గుండె సమస్యలు గుర్తించడం ఆలస్యమై.. పరిస్థితి చేజారిపోవడం, డెత్ రేట్ పెరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు సందీప్.






















