Diet and Fitness : అబ్బాయిలు.. మీ జిమ్ బాడీని ఇలా కాపాడుకోండి
చాలామంది జిమ్‌కి వెళ్తారు కానీ.. ఆ శరీరాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలీయదు.
సాధారణంగా జిమ్‌కెళ్లే వారిలో అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా ఉంటారు. ఈ మధ్యకాలంలో అందరిలో ఫిట్‌గా ఉండాలనే ఆలోచనలు ఉంటున్నా.. బయటకు వెళ్లగలిగే స్కోప్ ఎక్కువ తీసుకుని.. జిమ్‌లో కసరత్తులు చేసేది మాత్రం అబ్బాయిలనే చెప్పవచ్చు. అయితే జిమ్‌లో ఎంత కష్టపడినా.. డైట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మీ బాడీలో ఎప్పటికీ మార్పు ఉండదు. కాబట్టి మీరు చేసే వ్యాయామాలకు న్యాయం దక్కాలన్నా.. లేదంటే మీ జిమ్ బాడీని కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలన్నా ప్రోపర్ డైట్ అనేది కచ్చితంగా అవసరం. అయితే మీరు ఎలాంటి ఆహారాలు తీసుకుంటూ మీ శరీరాన్ని మంచి ఆకృతిలో మెయింటైన్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
లో కార్బో డైట్
మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు కచ్చితంగా లో కార్బోడైట్ పాటించాలి. మీరు మీ ఆహారంలో చేర్చే కార్బోహైడ్రేట్ల పరిమాణం.. మీ శరీర లక్ష్యాల్లో మార్పులు తీసుకొస్తుంది. బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అయితే దీనిలో భాగంగా మీరు ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి పూర్తిగా బాయ్ చెప్పేయాల్సి వస్తుంది.
ఆరోగ్య నిపుణులు కూడా ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్తారు. అయితే వీటికి బదులుగా తృణధాన్యాలు లేదా పొట్టుతో కూడిన పిండి పదార్థాలు తీసుకోవచ్చు. ఇవి కూడా నిర్దిష్ట పరిమాణంలోనే తీసుకోవాలి. ఇది మీరు త్వరగా బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
బరువును తగ్గించే పిండిపదార్థాలు..
పిండి పదార్థాలు బరువు పెరగడంలో ఎలా సహాయం చేస్తాయో.. కొన్ని పిండి పదార్థాలు బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. దీనిలో భాగంగా మీరు తృణధాన్యాలు, ఓట్స్, క్వినోవా వంటి మంచి, ముడి పిండి పదార్థాలు తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.
ప్రోటీన్ కండరాలకు మంచి బలాన్ని అందిస్తుంది. ఫైబర్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తుంది. కాబట్టి ఈ రెండూ ముఖ్యమైన పోషకాలు, బరువు తగ్గాలనుకునేవారికి చాలా అవసరం. కేవలం బరువు తగ్గాలనుకునేవారికి కాదు.. ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకునేవారికి కూడా మంచి ఎంపిక.
పూర్తిగా ఇంటి ఆహారం..
బయటఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా బరువు తగ్గుతారు. లేదంటే బరువు పెరగకుండా అయినా ఉంటారు. ఎందుకంటే బయట ఫుడ్ టేస్టీగా ఉండేందుకు.. వంటచేసే వాళ్లు ఏవేవో కలిపేస్తారు. ఇవి మీ బరువును అనారోగ్యకరమైన రీతిలో పెంచేస్తాయి. కాబట్టి టేస్టీగా తినాలనుకున్నా ఇంట్లోనే తయారు చేసుకోండి.
కొందరు జాబ్ రీత్యా, చదువు రీత్యా బయట ఉంటారు. అలాంటి వారికి ఇంటి భోజనం దొరకడం కష్టం కాబట్టి. కనీసం చిన్న చిన్న వంటలు ఇంట్లోనే కుక్ చేసుకోవడం ప్రారంభించండి. ఎగ్స్, ఫ్రూట్స్, నట్స్ వంటి వాటిపై మీరు ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. పచ్చి కూరగాయలు, పండ్లు, సలాడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవొచ్చు.
స్వీట్ టూత్ ఉంటే..
చాలామంది ఎన్ని డైట్స్ చేసినా.. స్వీట్స్‌ని చూస్తే మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వరు. కచ్చితంగా అవి తినేందుకు చూస్తారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే.. వాటికి ప్రత్యామ్నాయమైన స్వీట్లను ఎంచుకోండి. లేదంటే సహజమైన స్వీట్ క్రేవింగ్స్ తీర్చే పండ్లను ఎంచుకోవచ్చు. రోజులో ఒకటి లేదా రెండు ముక్కలు డార్క్ చాక్లెట్ తినొచ్చు. లేదంటే స్వీట్ తినాలనే కోరికను తగ్గించే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఫుడ్‌ను మీ డైట్లో చేర్చుకోవచ్చు.
సప్లిమెంట్స్
ఎన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా.. ఎంత జిమ్ చేసినా.. శరీరానికి కొన్ని ప్రోటీన్లు అందవు. అలాంటప్పుడు మీరు వైద్యుని సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కొందరికి పాలు, వాటితో తయారు చేసే పదార్థాలు అలెర్జీని కలిగిస్తాయి. ఆ సమయంలో మీరు పాలు నుంచి పొందే ప్రోటీన్లు పొందేందుకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ అనేవి.. మీరు ఎలాంటి శరీరాన్ని పొందాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వీటిని మీరు కచ్చితంగా ఫాలో అయితే మీ జిమ్ బాడీని కాపాడుకుంటూ.. బరువును సమతుల్యం చేసుకోగలుగుతారు.
Also Read : గ్రీన్ టీ తాగండి మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం వద్దు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.