Sun Flower Seeds: పొద్దు తిరుగుడు పూల గింజల ధర తక్కువే, తింటే వైరస్‌లను తట్టుకునే శక్తి ఖాయం
సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడేవారు అధికమే, కానీ ఎంత మంది పొద్దుతిరుగుడు పూల గింజలు తింటున్నారు? చాలా తక్కువ మందే.
సన్ ఫ్లవర్ ఆయిల్ వంటల్లో ప్రధాన భాగంగా మారిపోయింది. ఎప్పట్నించో ఆ నూనెను వాడడం అలవాటు చేసుకున్నారు ప్రజలు. ఆ నూనెలో ఉండే సుగుణాల వల్లే దానికి అంత డిమాండ్. మరి ఆ నూనె తయారయ్యే గింజలను మాత్రం పట్టించుకోరా? ఆహారంలో భాగం చేసుకోరా? నూనెలోనే పోషకాలు నిండుగా ఉంటే, అది తయారయ్యే గింజల్లో ఇంకెన్ని పోషకాలు ఉంటాయి? కాబట్టి రోజూ ఓ గుప్పెడు పొద్దు తిరుగుడు పూల గింజలు తినడం అలవాటు చేసుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడివి కూడా సూపర్ మార్కెట్లలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో దొరుకుతున్నాయి. ఖరీదు కూడా మరీ ఎక్కువేం కాదు. మధ్యతరగతి వారికి అందుబాటు ధరలోనే ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ సమయంలో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం.
ఈ కొవ్వెంతో ఆరోగ్యం...
పొద్దు తిరుగుడు పూల గింజల్లో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అది చాలా ఆరోగ్యవంతైన కొవ్వు. మన శరీరానికి ముఖ్యంగా గుండెకు అత్యవసరమైన మంచి కొవ్వులు అవన్నీ. వీటినే అన్ శాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. అలాగే ప్రొటీన్, విటమిన్ ఇ, విటమిన్ బి1, జింక్, మెగ్నిషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇంకా ఇతర ఖనిజాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గింజలు చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహం, హైబీపీతో బాధడుతున్న వారు వీటిని రోజువారీ ఆహారమెనూలో చేర్చుకుంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్, చక్కెర, బీపీ వంటివి అదుపులో ఉంటాయి. రక్త ఆరోగ్యాన్ని, సరఫరాని ఇవి మెరుగు పడేలా చేస్తాయి.
విటమిన్ ఇ
విటమిన్ ఇ దొరికే అతి కొద్ది ఆహారాల్లో ఇవీ ఒకటి. చర్మ సౌందర్యానికి, రక్షణకు విటమిన్ ఇ చాలా అవసరం. వందగ్రాములు పొద్దు తిరుగుడు గింజలు తింటే 38 గ్రాముల దాకా విటమిన్ ఇ దొరుకుతుంది. జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండే విటమిన్ ఇ మనకు కావాలి. ఇది రోగనిరోధక శక్తికి పెంచేందుకు కూడా సహాయపడుతుంది. విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ లా కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో సాయపడుతుంది.
శక్తి అధికమే...
అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఉత్తమ ఆహారం. వీటిని తిన్నాక చాలా సేపు ఆకలి వేయదు. కేవలం 100 గ్రాములు తింటే చాలు 600 క్యాలరీల శక్తి లభిస్తుంది. రోజు ఉదయాన గుప్పెడు తిన్నా చాలు తరువాత తినే ఆహారం తక్కువగా తింటారు. రోజంతా చురుగ్గా కూడా ఉంటారు. అయితే ఇక్కడ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... రోజుకు గుప్పెడు కన్నా అధికంగా తినకపోవడమే మంచిది. లేకుంటే కొందరిలో గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు. ఈ గింజలు త్వరగా జీర్ణం కావు కనుక ఇలాంటి సమస్యలు రావచ్చు.
Also read: లైవ్‌లో వంట చేసి చూపిద్దామనుకుంది, కానీ జరిగింది మరొకటి
Also read: ఫోన్‌తో అధిక సమయం గడుపుతున్నారా? ఈ వయసు వారిలో ఆత్మహత్యా ఆలోచనలు కలిగే అవకాశం