పీడకలలు వస్తున్నాయా? తేలికగా తీసుకోవద్దు, వాటర్ధం ఇది కావచ్చు
పీడకలలు కొంతమందిని చాలా వేధిస్తుంటాయి. కానీ ఎవరూ వాటిని సీరియస్‌గా తీసుకోరు.
రాత్రి కునుకుపట్టి గాఢనిద్రలోకి జారుకునే సరికి పీడకలలు రావడం మొదలవుతాయి. ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, లేదా దయ్యాలు భూతాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్టు... ఇలా భయపెట్టే కలలు కలవరాన్ని పెంచేస్తాయి. ఆ భయంతో మెలకువ వచ్చేస్తుంది కానీ ఇంకా అదే కల వెంటాడుతున్నట్టు ఉంటుంది. కొందరిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకునేవారు చాలా తక్కువ. అవే వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ వాటిని పట్టించుకోవాలని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు.
యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హోమ్ పరిశోధకులు చెప్పిన ప్రకారం ఇలా తరచూ పీడకలలు వచ్చే వారికి మతిమరుపు లేదా డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువట. విషయాలు త్వరగా అర్థం కావని, కొన్నిసార్లు మర్చిపోవడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఇందుకోసం మూడు వేల మందికి పైగా వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. అందులో 35 నుంచి 78 ఏళ్ల వరకు వయసుగల వారు ఉన్నారు. మధ్యవయసు వారికి అంటే 38 దాటిన వారికి తరచూ పీడకలలు వస్తుంటే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని తేలింది. ఇక ముసలి వారికి పీడకలలు వస్తే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికమని తెలిసింది.
ఆడవారి కన్నా మగవారిలోనే పీడకలల కారణంగా మతి మరుపు వచ్చే అవకాశం అధికమని చెప్పారు. అయితే పీడకలలు మతిమరుపు వచ్చేలా చేయడానికి కారణాలు ఏంటో ఇంకా తెలుసుకోలేదు. దీనికి మరింత లోతైన అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పీడకలలు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిజజీవితంలో ఉన్న భయాలు కూడా పీడకలల రూపంలో వేధించవచ్చు. కాబట్టి పీడకలల కారణంగా నిద్రపట్టని పరిస్థితి ఉండడం, వాటి వల్ల ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. లేకుంటే వాటి వల్ల కలిగే భయం మానసిక సమస్యల తీవ్రంగా పడేలా చేస్తుంది. ఎక్కువ రోజులు సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. కాబట్టి పీడకలలను తేలికగా తీసుకోవద్దు.
Also read: బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.