బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి
బ్యూటీ పార్లర్‌కు వెళ్లే ముందు కచ్చితంగా మీరు ఈ ఘటన గురించి తెలుసుకోవాలి.
అందంపై వ్యామోహం పెరిగిపోయిన రోజులు. తలస్నానం, హెన్నా పెట్టించుకోవడం కోసం, ఫేస్ ప్యాక్‌లు, పెడిక్యూర్, వ్యాక్సింగ్ ఇలా రకరకాల సర్వీసుల కోసం బ్యూటీ పార్లర్‌కు వెళతారు ఎంతోమంది మహిళలు. అలా వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చాక ఆసుపత్రి పాలైంది. ఆమెకేమైందో తెలుసుకుని అందరూ షాక్ తిన్నారు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లడమే ఆమెకు శాపంలా మారింది. ఆ మహిళ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ బారిన పడినట్టు గుర్తించారు వైద్యులు. వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అందరికీ జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు.
అసలేమైంది?
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ (యాభై ఏళ్ల వయసు) బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఆమె అక్కడ హెయిర్ వాష్ (తల స్నానం) చేయించుకుంది. తరువాత ఇంటికి వచ్చాక కాస్త నలతగా అనిపించింది. వికారం, వాంతులు, కళ్లు తిరగడం వంటివి మొదలయ్యాయి. దీంతో ఆమెను మొదట గ్యాస్ట్రోఎంటరాలజిస్టు దగ్గర తీసుకెళ్లారు. అతను ఆమెను పరీక్షించాక న్యూరాలజిస్టు దగ్గరకు పంపించారు. చివరికి ఆమె ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ బారిన పడినట్టు తెలిసింది. ఆ సమస్యకు తగ్గ చికిత్సను అందిస్తున్నారు వైద్యులు.
ఎందుకొస్తుంది?
వైద్యులు చెప్పిన ప్రకారం హెడ్ వాష్ కోసం మెడను వాష్ బేసిన్‌లపై పెట్టిస్తారు. అప్పుడు మెడలోని హైపర్ ఎక్స్‌టెన్న్ తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. మెడపై చాలా ఒత్తిడి పడుతుంది. మెడ కొంతవరకు సాగినట్టు పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో మెడలోని ఎముకలు ఒకదానిపై ఒకటి కొద్దిగా జరగవచ్చు. దీని వల్ల కరోటిడ్ అనే వెన్నుపూసకు వెళ్లే రక్తనాళమైన ధమని గాయపడవచ్చు. తద్వారా రక్తం గడ్డ కట్టి మెదడు స్ట్రోక్ కు గురవ్వచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఆసుపత్రి పాలు కావచ్చు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
వైద్యులు చెప్పిన ప్రకారం ఇలాంటి స్ట్రోక్ రాగానే ఒక చేయి వైపు చేయి బలహీనంగా మారడం, ముఖం వంకర తిరగడం, మాట్లాడడం ఇబ్బంది ఎదురవ్వడం కలుగుతాయి. నడిచేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది, తూలుతున్నట్టు అవుతారు. ఒక్కోసారి కిందపడిపోతారు. తలతిరగడం, వికారం, వాంతులు, తలనొప్పి, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్త పడాలి...
సెలూన్లకు, బ్యూటీపార్లర్లకు వెళ్లొద్దని వైద్యులు చెప్పడం లేదు కానీ తగిన జాగ్రత్తల పాటించమని సూచిస్తున్నారు. మెడపై అధికంగా భారం పడడం,అసౌకర్యంగా అనిపించడం, ఇబ్బందిగా అనిపించడం వంటివి కలగకుండా చూసుకోవాలి. శరీరాన్ని కష్టపెట్టకుండా సర్వీసులు చేయించుకోవాలి.
Also read: ఆ బాలీవుడ్ హీరోకు వింత ఆరోగ్య సమస్య, అధిక ఒత్తిడి వల్లేనట - ఇది ఎవరికైనా రావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.