Hair Regrowth : ఉల్లిపాయ రసం తలకు అప్లై చేస్తే జుట్టు రీ గ్రోత్ అవుతుందా? మగవారికి మరీ మంచిదట
Hair Care Tips : ఉల్లిపాయ రసం తలకు అప్లై చేస్తే జుట్టు రీ గ్రోత్ అవుతుందని అంటున్నారు. ఇంతకీ దీనిలో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Hair Regrowth with Onion Juice : జుట్టు రాలడానికి వివిధ కారణాలు ఉంటాయి. కొన్ని సందర్బాల్లో ఆరోగ్య సమస్యలు కూడా జుట్టును ఎఫెక్ట్ చేస్తాయి. కాలుష్యం, చుండ్రు వంటి ఇతర కారణాలు జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. ఆ సందర్భంలో చాలామంది షాంపూలు, నూనెలు మార్చడం చేస్తారు. అంతేకాకుండా వివిధ ఇంటి చిట్కాలు కూడా ట్రై చేస్తారు. వాటిలో ఉల్లిపాయ రసం కూడా ఒకటి. అయితే దీనిని జుట్టుకు అప్లై చేస్తే మంచిదేనా? నిపుణులు ఏమి చెప్తున్నారు?
జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే రీ గ్రోత్ కోసం ఉల్లిపాయ రసం అప్లై చేస్తే మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పలు అధ్యయనాలు చెప్తున్నాయి. జుట్టు పెరగాలనుకున్నా.. రీ గ్రోత్ అవ్వాలి అన్నా.. ఉల్లిపాయ రసం జుట్టుకు అప్లై చేసుకోవాలంటున్నారు. మరి ఇది నిజంగానే జుట్టు మళ్లీ వచ్చేలా చేస్తుందా? ఉల్లిరసం వల్ల జుట్టుకు కలిగే లాభాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరువారాల్లో హెయిర్ గ్రోత్
గతంలో ది జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ఓ అధ్యయనం గురించి పబ్లిష్ చేశారు. దాని ప్రకారం అలోపేసియా అరేటాతో బాధపడేవారు రోజుకు రెండుసార్లు స్కాల్ప్‌కు ఉల్లిపాయను అప్లై చేస్తే ఆరు వారాల్లో జుట్టు తిరిగి పెరిగినట్లు తేలింది. అలోపేసియా అరేటా అంటే.. ఆటో ఇమ్యూన్ డీసీజ్. దీనివల్ల జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం జరుగుతుంది. ఆ సమస్యను ఉల్లిరసం దూరం చేస్తుందని చెప్తున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 86.9 శాతం మందికి జుట్టు తిరిగి పెరిగిందని అధ్యయనంలో తేలింది. వీరిలో మగవారికే ఎక్కువ బెనిఫిట్ అందిందని తెలిపారు. పురుషుల్లో 93.7 శాతం ఫలితాలు ఉంటే మహిళల్లో 71.4 శాతం జుట్టు పెరిగిందట.
జుట్టుకు అందే లాభాలివే..
ఉల్లిపాయల్లో జుట్టు కుదుళ్లకు పోషణను అందించే క్వెర్సెటిన్ వంటి సల్ఫర్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి. ఉల్లిరసంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా చేస్తాయి. ఇవి హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేయడంతో పాటు.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.
జన్యుపరమైన సమస్యలున్నవారికి, బట్టతల ఉన్నవారికి ఇది పూర్తి ఫలితాలు ఇవ్వకపోయినా.. వివిధ కారణాలతో జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతుంటే దీనిని ట్రై చేయవచ్చని చెప్తున్నారు. అయితే కంటిన్యూగా కాకపోయినా.. మీకు వీలు ఉన్నప్పుడల్లా దీనిని అప్లై చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. అధ్యయనంలో పాల్గొన్నవారు రోజుకు రెండుసార్లు.. ఆరువారాలు అప్లై చేసి రీగ్రోత్ చూశారు. కాబట్టి మీ రిక్వైర్మెంట్స్ బట్టి దీనిని మీ హెయిర్ కేర్ రొటీన్లో చేర్చుకోవచ్చు.
ఎలా అప్లై చేయవచ్చంటే..
ఉల్లిపాయలను ముక్కలుగా చేసి.. దానిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దానినుంచి రసాన్ని తీసుకుని.. దానిని స్కాల్ప్‌కి అప్లై చేయాలి. మీరు రోజూ ఉపయోగించకపోతే వారానికి రెండుసార్లు దీనిని స్కాల్ప్‌కి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి మరిగించి.. దానిని తలకు అప్లై చేయవచ్చు.






















