High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి
హైబీపీ వల్ల గుండె, మెదడు ప్రమాదంలో పడిపోతాయి. అందుకే దాన్ని అదుపులో ఉంచుకునేందుకు చక్కటి పరిష్కారం పండ్లు, కూరగాయలు.
శరీరాన్ని నాశనం చేసే రోగాల్లో డయాబెటిస్, అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటాయి. అత్యధికులు ఈ రెండు వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన పరిస్థితులు వీటి వల్లే వస్తాయి. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుకోకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు దాడి చేసేందుకు వచ్చేస్తాయి. అయితే దీన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు అద్భుతమైన మార్గం పండ్లు, కూరగాయలు తినడం. ఇవి రెండూ హైబీపీని అదుపులో ఉంచుతాయని పరిశోధకులు తెలిపారు.
యూనివర్సిటీ ఆఫ్ కెంట్ లోని స్టాటిస్టిక్స్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ జేమ్స్ బెంథమ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మరొకరితో కలిసి ఈ పరిశోధన జరిపారు. అందుకు వాళ్ళు 1975 నుంచి 2015 వరకు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న పండ్లు, కూరగాయల జాబితాను విశ్లేషించారు. డబ్యూహెచ్ఓ సిఫార్సు చేసినట్టుగా రోజుకు 400 గ్రాముల వరకు పండ్లు, కూరగాయలు అందుకుంటున్నారో లేదో పరిశీలించారు. దాదాపు 159 దేశాల్లో పండ్లు, కూరగాయలు సరఫరా రక్తపోటుతో బాధపడుతున్న వారి డేటాను గమనించారు. సిస్టోలిక్, డయాస్టోలీక్ ఏ విధంగా ఉన్నాయే పరిశీలించారు. పండ్లు, కూరగాయల వాడకం అధికంగా ఉన్న వారిలో రక్తపోటు తగ్గుతుందని ఫలితాలు సూచించాయి.
కొన్ని దేశాల్లో పండ్లు, కూరగాయలు సరిగా అందుబాటులో లేకపోవడం ఒక సమస్యగా మారిందని పరిశోధన చేసిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి కనిపించింది. వారిలో రక్తపోటు స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్ బెంథమ్ వెల్లడించారు. యూకేలో ఈ విధమైన పరిస్థితి కూడా ఉందని ఆయన తెలిపారు. లాజిస్టిక్స్ లేకపోవడం వల్ల పండ్లు, కూరగాయల కొనుగోలు పరిమితం పరిస్థితి అప్పుడప్పుడూ ఎదురవుతుందని ఆయన తెలిపారు.
ఇవి తినాలి
అధిక రక్తపోటుని నియంత్రణలో ఉంచుకునేందుకు సీజనల్ వారీగా వచ్చే పండ్లు తినాలి. బెర్రీలు, అరటిపండు, కివీ, పుచ్చకాయ, ఆప్రికాట్స్ వంటి పండ్లు తినాలి. అలాగే ఆకుపచ్చని ఆకుకూరలు, ఓట్స్, పిస్తా, వాల్ నట్స్ తీసుకుంటే మంచిది. ఇవే కాకుండా కొవ్వు చేపలు తింటే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. డార్క్ చాక్లెట్, చిక్కుళ్ళు, దానిమ్మ, పెరుగు, నట్స్, దాల్చిన చెక్క, సిట్రస్ పండ్లు తీసుకోవాలి.
ఇవి తగ్గించుకోవాలి
రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు దూరంగా ఉంచాలి. అందులో మొదటిది ఉప్పు. రోజుకి 2.3 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అంటే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే. కెఫీన్, ఆల్కాహాల్, ప్రాసెస్ చేసిన ఫుడ్ కి దూరంగా ఉండాలి.
ఇవే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. కంటి నిండా నిద్రపోతు సమయానికి భోజనం చేయడం వంటివి తప్పనిసరిగా చేయాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఎటువంటి రోగాన్ని అయినా నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త