Swollen Feet : పాదాల వాపును తేలిగ్గా తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే, జాగ్రత్త
Foot Swelling : మీ పాదాలలో తరచుగా వాపు ఉంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వాపు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే

Foot Swelling Isn’t Just Common : పాదాలలో వాపు అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. వివిధ కారణాల వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ వాపు రెగ్యులర్‌గా కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కేవలం అలసట లేదా ఎక్కువసేపు నిలబడటం వల్ల వచ్చేది కాదని.. కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కూడా కావచ్చని చెప్తున్నారు. కాబట్టి మీ పాదాలలో తరచుగా వాపు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా ఉదయం నిద్రలేచిన తర్వాత వాపు తగ్గకపోతే వెంటనే అలెర్ట్ అవ్వాలని చెప్తున్నారు.
పాదాల వాపునకు సాధారణ కారణాలు
పాదాల వాపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వాటిలో కంగారు పడాల్సిన అవసరం లేని కారణాలు ఏంటో తెలుసుకుంటే.. సీరయస్‌గా తీసుకోవాల్సిన కారణాలు తెలుస్తాయి. ఇంతకీ పాదాల్లో వాపునకు ఏవి కారణమంటే..
- ఎక్కువ సమయం నిలబడటం లేదా కూర్చోవడం వల్ల చాలామందిలో వాపులు కనిపిస్తాయి. గురుత్వాకర్షణ కారణంగా పాదాలలో రక్తం, నీరు పేరుకుని ఉబ్బినట్లు కనిపిస్తాయి.
- గర్భిణీ స్త్రీల శరీరంలో నీరు పెరగడం, గర్భాశయంపై ఒత్తిడి కారణంగా పాదాలలో వాపు సాధారణంగా చెప్తారు.
- అధిక బరువు వల్ల కూడా వాపు కనిపిస్తుంది. ఊబకాయం పాదాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల వాపు వస్తుంది.
- కాలు లేదా చీలమండకు ఏదైనా గాయం తగిలితే అది వాపునకు కారణం కావొచ్చు.
- రక్తపోటు మందులు, స్టెరాయిడ్లు లేదా హార్మోన్ల మందులు వంటివి వాపునకు కారణం కావచ్చు.
- ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు కూడా శరీరంలో నీరు పేరుకుంటుంది. దీనివల్ల వాపు వస్తుంది.
పాదాల వాపు ఏ వ్యాధుల సంకేతం కావచ్చు?
పైన పేర్కొన్న లక్షణాలు అన్ని చాలా సాధారణమైనవే. ఇవి తాత్కాలికంగా ఉంటాయి. సరైన కేర్ తీసుకుంటే వాపు కనిపించదు. అయితే పాదాలలో వాపు రెగ్యులర్‌గా ఉంటూ.. ఇతర లక్షణాలు కనిపిస్తే.. తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. అవేంటంటే..
- గుండె జబ్బు (Heart Failure) : గుండె బలహీనపడినప్పుడు, శరీరంలోకి రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు.. రక్తం.. సిరల్లో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో పాదాల్లో లేదా చీలమండలంలో వాపు కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో ఈ లక్షణం కనిపిస్తుంది. అయితే దీనితో పాటు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత వంటి లక్షణాలు కూడా ఉంటే గుండె సమస్యకు సంకేంతంగా చెప్తారు.
- కిడ్నీ వ్యాధి : కిడ్నీ పనితీరు ఏమిటంటే శరీరంలోని అదనపు నీరు, వ్యర్థాలను బయటకు పంపడమే. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ ద్రవాలు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పాదాలు, చీలమండల్లో వాపు కనిపిస్తాయి. కళ్లు చుట్టూ కూడా వాపు కనిపిస్తుంది.
- కాలేయ వ్యాధి: కాలేయం శరీరంలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్‌ను తయారు చేస్తుంది. ఇది రక్త నాళాలలో నీటిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు, ఆల్బుమిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నీరు రక్త నాళాల నుంచి బయటకు వచ్చి శరీర కణజాలంలో పేరుకుపోతుంది. దీనివల్ల పాదాలు, పొత్తికడుపులో వాపు కనిపిస్తుంది.
- థైరాయిడ్ సమస్య (Hypothyroidism): థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు శరీరంలో జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ద్రవాలు పేరుకుపోవచ్చు. పాదాలు, చీలమండలు, ముఖంపై వాపు వస్తుంది.
- రక్తపు గడ్డలు (Deep Vein Thrombosis - DVT): కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం (DVT) ఒక తీవ్రమైన సమస్య. ఇందులో సాధారణంగా ఒక కాలులో అకస్మాత్తుగా వాపు, నొప్పి, ఎరుపు, మంట అనుభూతి కలుగుతుంది. ఇది అత్యవసరమైన వైద్య పరిస్థితి. ఎందుకంటే గడ్డ విరిగి ఊపిరితిత్తులకు చేరుకుంటే ప్రాణాంతకమవుతుంది.
- లింఫెడెమా (Lymphedema): ఇది లింఫాటిక్ వ్యవస్థ (శరీరం నుంచి అదనపు నీటిని తొలగించే పని చేసేది)లో సమస్య కారణంగా వస్తుంది. లింఫాటిక్ నాళాలు దెబ్బతిన్న లేదా మూసుకుపోయినట్లయితే.. ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఒకటి లేదా రెండు కాళ్లలో నిరంతరం వాపు వస్తుంది. ఇది క్యాన్సర్ చికిత్స లేదా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు.
- వెరికోస్ సిరలు (Varicose Veins) : కాళ్ల సిరలు బలహీనంగా మారినప్పుడు లేదా వాటిలోని కవాటాలు దెబ్బతిన్నప్పుడు.. రక్తం కాళ్ల నుంచి గుండెకు సరిగ్గా తిరిగి వెళ్లదు. దీనివల్ల రక్తం కాళ్ల సిరల్లో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. పాదాలు, చీలమండలాల్లో వాపు వస్తుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
పాదాలలో వాపుతో పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వాపు అకస్మాత్తుగా వచ్చి వేగంగా పెరిగినప్పుడు, వాపుతో పాటు నొప్పి, ఎరుపు లేదా మంట ఉన్నప్పుడు, ఒక కాలులో ఎక్కువ వాపు ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా మైకం అనిపిస్తే, వాపుతో పాటు జ్వరం ఉంటే, గర్భధారణ సమయంలో వాపు అకస్మాత్తుగా పెరిగితే వైద్యుడి సలహాలు తీసుకోవాలి.






















