Fatigue: వేసవిలో అలసట చాలా ప్రమాదకరం- దాన్ని అధిగమించేందుకు ఈ టిప్స్ పాటించండి
సమ్మర్ లో ఎప్పుడూ అలసట, నీరసంగా అనిపిస్తూ బెడ్ కి అతుక్కుపోతున్నారా? అది చాలా ప్రమాదకరం. తేలికగా తీసుకోవద్దు.
వేసవిలో చాలా మంది రోజంతా నీరసంగా కనిపిస్తారు. నిద్రపోవాలని అనిపిస్తుంది. వేడి వాతావరణం మనలో శక్తిని కోల్పోయేలా చేస్తుంది. పగటిపూట నిద్ర ఎక్కువగా రావడానికి కారణం మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడమే. ఇది శరీరం నిద్ర, మేల్కోనే చక్రాలను నియంత్రించే హార్మోన్. వేసవిలో ఎక్కువ మంది అలసిపోవడానికి ప్రధాన కారణం ఇదే. దీన్ని అధిగమించాలంటే మీరు కొన్ని సులభమైన పనులు చేయాలి. ఇలా చేసి మీ శక్తి స్థాయిలను పెంచుకోవచ్చు.
హైడ్రేట్ గా ఉండటం
ఎండాకాలం అలసటకు సాధారణ కారణాలలో డీహైడ్రేషన్ ఒకటి. శరీరం చాలా నీటిని కోల్పోయినప్పుడు శక్తి తక్కువగా ఉంటుంది. కెఫీన్ పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి. శక్తివంతంగా తాజాగా ఉండటానికి పుచ్చకాయ రసం, కొబ్బరి నీళ్ళు, హెర్బల్ టీ వంటి చల్లని పానీయాలు తాగడం అలవాటు చేసుకోవాలి.
సమతుల్య ఆహారం
ఈ ఎండలకు భారీ భోజనం చేయడం వల్ల నీరసం వచ్చేస్తుంది. పేగులు తేలికగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జంక్, ప్రాసెస్డ్, ఆయిల్, షుగర్, క్యాన్డ్ ఫుడ్ తినడం మానుకోవాలి. బదులుగా పండ్లు, కూరగాయళ్ళు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవాలి. తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ సహా అన్ని అవసరమైన పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు.
క్రమం తప్పకుండా వ్యాయామం
రెగ్యులర్ వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది సహజ మూడ్ బూస్టర్‌లుగా పని చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. దినచర్యలో కనీసం 30 నిమిషాల పాటు నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి మితమైన వ్యాయామాలను జోడించడం మంచిది.
తగినంత నిద్ర
నిద్ర శరీరానికి చాలా ముఖ్యం. వేసవిలో పగలు ఎక్కువ, రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. అందుకే నిద్ర తగినంతగా ఉండదు. శక్తి స్థాయిలను పెంచుకోవడానికి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా కీలకం. నిద్ర విధానానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. మసక వెలుతురు, బెడ్ రూమ్ వాతావరణం చల్లగా ఉండేలా చూసుకుంటే హాయిగా నిద్రపడుతుంది.
చల్లగా ఉండాలి
శరీరం వేడిగా సెగలు కక్కుతూ ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. తేలికైన వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. శరీరం చల్లగా ఉండేందుకు అవసరమైన పానీయాలు తీసుకోవాలి. ఇండోర్ మొక్కలు పెంచుకుంటే గది కూడా చల్లబడుతుంది.
ఒత్తిడి అదుపులో
వేసవిలో అలసటకి మరొక కారణం అధిక స్థాయిలో ఒత్తిడి. దీన్ని దూరం చేసుకునేందుకు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటి పద్ధతులు పాటించాలి. పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి.
సూర్యరశ్మిని నివారించాలి
మండుతున్న ఎండలో ఎక్కువ గంటలు పాటు ఉండకూడదు. వేడి శక్తిని హరించి నిర్జలీకరణానికి దారి తీస్తుంది. అందుకే బాగా ఎండగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకపోవడం ఉత్తమం. ఎప్పుడు సన్ గ్లాసెస్, టోపీలు ధరించాలి. ముఖాన్ని కవర్ చేసే విధంగా స్కార్ఫ్ ధరించం చాలా ముఖ్యం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఆ విటమిన్ లోపిస్తే పిల్లలు పుట్టడం కష్టమా? దీన్ని అధిగమించడం ఎలా?