(Source: ECI | ABP NEWS)
Flying Snakes : ఎగిరే పాముల గురించి తెలుసా? అవి తలమీద నుంచి వెళ్తే పొడవు తగ్గిపోతారట, ఇంట్రెస్టింగ్ విషయాలివే
Flying Snakes Myths : పాముల గురించి అందరికీ తెలుసు. కానీ ఎగిరే పాముల గురించి ఎప్పుడైనా విన్నారా? అవి తలపై నుంచి వెళ్తే మనిషి పొడవు తగ్గుతాడా? నిజమేంటో తెలుసుకుందాం.

Flying Snakes Facts : ఎగిరే పాములను శాస్త్రీయంగా క్రైసోపీలియా అని పిలుస్తారు. ఇవి చాలా ఆసక్తికరమైన జీవులలో ఒకటి. ఇవి ప్రధానంగా ఆగ్నేసియా, ఇండియాలోని కొన్ని ప్రాంతాలలోని దట్టమైన అడవులలో కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన జాతి గాలిలో ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి అసాధారణ ప్రతిభ కారణంగా.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా పాములు భూమి మీద పాకుతూ కనిపిస్తాయి. కానీ ఎగరడం అనేది చాలామందికి ఆసక్తికరమైన విషయమే. అయితే ఈ పాము ఎవరి మీదుగానైనా వెళితే.. ఆ వ్యక్తి పొడవు తగ్గుతుందని చెబుతారు. మరి ఇది ఎంతవరకు నిజం? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
ఎగిరే పాములు ఎక్కడుంటాయి?
ఎగిరే పాములు ప్రధానంగా ఆగ్నేసియా, భారతదేశం, శ్రీలంకలోని పచ్చని అడవులలో కనిపిస్తాయి. వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, మయన్మార్, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ చైనా వంటి దేశాలలో చాలా సాధారణంగా కనిపిస్తాయి. భారతదేశంలో గోల్డెన్ ట్రీ స్నేక్ వంటి కొన్ని జాతులు.. దక్షిణ ప్రాంతం, పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ పాములకు ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకడానికి ఎత్తైన చెట్లు అవసరం.
ఎలా ఎగురుతాయి?
వాస్తవానికి పక్షులు లేదా గబ్బిలాల మాదిరిగా.. ఈ పాములకు రెక్కలు ఉండవు. ఇవి తమ పక్కటెముకలను విస్తరించి.. శరీరాన్ని చదునుగా చేస్తాయి. దీని వలన పుటాకార ఆకారం ఏర్పడుతుంది. దీని సహాయంతో ఇవి గాలి ప్రభావాన్ని పట్టుకోగలవు. గాలిలో ఎగిరిన తరువాత.. అవి S-ఆకారపు తరంగాల కదలికలో కదులుతూ ఉంటాయి. ఇది స్థిరంగా ఉండటానికి, గాలిలో తమ దిశను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ పాములు 100 మీటర్ల వరకు ఎగరగలవు.
పాములు ఎందుకు ఎగురుతాయంటే..
ఈ పాములు ఎగరడం అనే నైపుణ్యాన్ని కేవలం ప్రదర్శన కోసం మాత్రమే చేయవట. ఎగిరే పాములు వేటాడేవారి నుంచి తప్పించుకోవడానికి, చిన్న జంతువులను వేటాడటానికి, నేలపైకి దిగకుండా చెట్ల మధ్య తిరగడానికి ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఎగిరే పాములు ఎంత ప్రమాదకరమైనవంటే..
ఎగిరే పాములు స్వల్ప విషపూరితమైనవి. కానీ వాటి విషం బల్లులు, పక్షులు వంటి చిన్న జంతువులను నియంత్రించడానికి మాత్రమే ఉపయోగపడుతుందట. మనుషులపై వీటి ప్రభావం పెద్దగా ఉండదట. అలాగే అవి కరిచినప్పుడు మనిషికి కొద్దిగా మంట లేదా వాపు రావచ్చట.
మనిషి పొడవు తగ్గుతారా?
ఎగిరే పాముల గురించి చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ పాములు ఎవరి మీదుగానైనా వెళితే.. ఆ వ్యక్తి పొడవు తగ్గుతుందని నమ్ముతారు. వాస్తవానికి ఇది పూర్తిగా మూఢనమ్మకమని చెప్తున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ లేదా జీవసంబంధిత ఆధారం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలో ఎగిరే పాములు ఏ విధంగానూ వ్యక్తి ఎత్తు లేదా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయలేవని మాత్రం చెప్తున్నారు.






















