Engineer’s Day: మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించిన మహనీయుడు... మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారత నీటిపారుదల వ్యవస్థకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను ‘ఇంజినీర్స్ డే’గా మన దేశంలో నిర్వహించుకుంటారు.
దాదాపు వందేళ్ల క్రితం... మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించేది. 1908లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి... నివాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఆ వరదలకు వందల మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. అంతకుముందు కూడా మూసీ నది వరదలు వచ్చినా ఈ స్థాయిలో రాలేదు. మొదటిసారి మూసీ భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో అప్పటి నవాబు ప్రత్యేకంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి ఆహ్వానించారు. ఆయన సూచనల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు.అప్పట్నించి మూసీ నది వల్ల భాగ్య నగరం వరదలు రావడం తగ్గాయి. కేవలం ఇదొక్కటే కాదు దేశంలో ఎన్నో నగరాల మురుగునీటి పారుదల వ్యవస్థలకు ఆయన రూపకల్పన చేశారు. పలుడ్యామ్ ల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. భారత నీటిపారుదల వ్యవస్థకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా వ్యవహరిస్తాం.
శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇతని తలిదండ్రులు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వలస వెళ్లారు. విశ్వేశ్వరయ్యకు పన్నేండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా చదువును ఆపలేదు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు పూర్తి చేశారు. 23 ఏళ్ల వయసులోనే బొంబాయిలో అసిస్టెంటు ఇంజినీరుగా చేరారు. తరువాత భారత నీటిపారుదల కమిషనులో పనిచేసే అవకాశం వచ్చింది. అప్పట్నించి అతని ధ్యేయం దేశంలో ఉన్నత నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడమే.
ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేకుండా నీటిని నిల్వచేసేందుకు ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు విశ్వేశ్వరయ్య. దీన్ని మొదటిసారి 1903లో పుణె దగ్గరి ఖడక్ వాస్లా ఆనకట్టపై ఈ వ్యవస్థను అమలుపరిచారు. విజయవంతం కావడంతో గ్వాలియర్ దగ్గరున్న ఆనకట్ట, మైసూరులో గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. అంతేకాదు దేశంలోని పలు నగరాల్లోని మురుగు నీటి వ్యవస్థకు ప్రణాళికలు వేసి విజయం సాధించారు. ఆయన గురించి తెలిసి1906-1907 మధ్య కాలంలో భారత ప్రభుత్వం యెమెన్ కి పంపింది. అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అక్కడి ప్రాజెక్టులను విజయవంతం చేసి తిరిగి స్వదేశానికి వచ్చారు విశ్వేశ్వరయ్య.
విశాఖపట్నం తీరంలో సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడేది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి నివారించే వ్యవస్థను ఆయన రూపొందించారు. అంతేకాదు కోట్లాది భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రయాణించే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది కూడా ఆయనే. 1944లో తొలి విడత ఘాట్ రోడ్డును నిర్మించారు. ఈయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారతరత్న’పురస్కారంతో సత్కరించింది. 1912 నుంచి 1918 వరకు మైసూర్ దివాన్‌గా పనిచేశారు విశ్వేశ్వరయ్య. ఆ నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చి దిద్దారు. వందేళ్లకు పైగా జీవించిన ఈ మహనీయుడు 1962 ఏప్రిల్ 14న మరణించారు.