Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?
నీరసంగా అనిపించినప్పుడు వెంటనే ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తారు. వాటి వల్ల ఎనర్జీ వస్తుంది కానీ దానితో పాటి ఇతర రోగాలు కూడా వచ్చేస్తాయి.
జిమ్ లో అతిగా వ్యాయామం చేసినప్పుడు లేదంటే ఫీల్డ్ లో స్పోర్ట్స్ ఆడినప్పుడు రిఫ్రెషింగ్ కోసం ఎక్కువ మంది ఎంచుకునేది ఎనర్జీ డ్రింక్స్. వీటిని తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కొంతమంది ఇళ్ళలో ఫ్రిజ్ తీస్తే ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కనిపిస్తాయి. కానీ ఈ కెఫీన్ పానీయాలు మంచి కంటే ఎక్కువగా హాని చేస్తాయి. సాధారణ స్వీటెనర్ డ్రింక్స్ శరీరంపై రోగనిరోధక శక్తిని అణచివేసే ప్రభావాన్ని చూపుతున్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులని తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
అధిక మొత్తంలో సుక్రోలోజ్ తీసుకోవడం వల్ల ఎలుకల్లో తెల్ల రక్త కణాలు క్రియాశీలత తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, టైప్ 1 డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులపై సానుకూల ప్రభావాలని చూపిందని తెలిపారు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండాలన్నా, వ్యాధులను ఎదుర్కోవాలన్న వీటిని దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.
సుక్రోలోజ్ అంటే ఏంటి?
ఇది ఒక కృత్రిమ స్వీటెనర్. చక్కెర కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుంది. ఆహారం, పానీయాలలో దీన్ని అధికంగా ఉపయోగిస్తారు. అయితే దీని ప్రభావాలు శరీరం మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయనే దాని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. నేచర్ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం ఎలుకలకు 30 కప్పుల తీపి కాఫీకి సమానమైన సుక్రోలోజ్ తినిపించారు. అంటే 10 క్యాన్ల ఫిజీ ఎనర్జీ డ్రింక్స్. ఇవి తీసుకున్న ఎలుకల్లో తక్కువ మొత్తంలో T సెల్స్ విడుదల అయ్యాయి. ఇవి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్తకణాల్లో ఒక రకం. అయితే ఇవి రోగనిరోధక శక్తి కణాలపై ఎటువంటి ప్రభావం చూపించలేదని పరిశోధకులు తెలిపారు.
సుక్రోలోజ్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ లోని కెఫీన్ అధిక మొత్తంలో శరీరంలోకి చేరితే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాని ప్రభావం అన్నింటికంటే ముందు గుండె పనితీరుపై కనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎనర్జీ డ్రింకులు తాగడం తగ్గించమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఎలక్ట్రోలైట్ లేనివి. రక్తప్రవాహంలోకి ప్రవేశించే చక్కెరని కరిగించడానికి కెఫీన్ శరీరం నుంచి నీటిని విసర్జిస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. ఇవి తాగిన వెంటనే దప్పిక తీరినట్టు అనిపిస్తుంది కానీ కాసేపటికే దాహంగా ఉంటుంది. మెదడుని ఉత్తేజపరిచి ఏకాగ్రతను పెంచుతుంది. కానీ గుండెపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఎనర్జీ డ్రింక్స్ తాగడం తగ్గించమని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ పండ్లు తిన్నారంటే మెరిసే చర్మం మీ సొంతం