ENG vs NEP: ఉత్కంఠపోరులో నేపాల్‌పై ఇంగ్లాండ్ విజయం.. ఆకట్టుకుంటున్న చిన్న జట్లు
T20 World Cup 2026 | T20 ప్రపంచ కప్ 2026లో ఇంగ్లాండ్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మజా ఇచ్చింది. ఉత్కంఠపోరులో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.

T20 World Cup 2026 ENG vs NEP Highlights: T20 ప్రపంచ కప్ 2026 లో దాదాపు అన్ని మ్యాచ్‌లలో చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిచ్చినంత పని చేశాయి. తాజాగా ఐదవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నేపాల్ టీంతో అదే పరిస్థితి ఎదురైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠపోరులో నేపాల్ మీద ఇంగ్లాండ్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
ఒకనొక దశలో నేపాల్ జట్టు సులభంగా ఇంగ్లాండ్‌ను ఓడిస్తుందని అనిపించింది. కానీ చివరికి ఇంగ్లాండ్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెథెల్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో నేపాల్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కర్రాన్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంతో ఇంగ్లాండ్ విజయం సాధ్యమైంది.
సామ్ కర్రాన్ ఇంగ్లాండ్ టీంకు హీరోగా నిలిచాడు. చివరి ఓవర్లో నేపాల్ కనుక 10 పరుగులు చేస్తే నెగ్గేది. కానీ కర్రన్ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఖచ్చితమైన యార్కర్లతో నేపాలీ బ్యాటర్లను కట్టడి చేయడం హైలైట్. దాంతో మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొంది.
Victory in Mumbai 🦁
— England Cricket (@englandcricket) February 8, 2026
A nail-biter in our @T20WorldCup opener with Nepal 🏏
Match Centre: https://t.co/mOHOKi4lxY pic.twitter.com/L6mhoOekk7
నేపాల్ ఆటగాళ్ల ఇన్నింగ్స్ వృథా
నేపాల్ జట్టులో దీపేంద్ర సింగ్ ఏరి, లోకేష్ బామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే, వీరి ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. దీపేంద్ర 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. దీంతో పాటు లోకేష్ 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులతో రాణించాడు.
Nerve held.
— England Cricket (@englandcricket) February 8, 2026
An outstanding final over from @CurranSM 👏
Match Centre: https://t.co/9xbDJHvEPC pic.twitter.com/F7yaQ3tEwh
రాణించిన బెథెల్, బ్రూక్
నేపాల్ జట్టుతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ అత్యధికంగా 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ (55 పరుగులు) చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులతో రాణించాడు.
రన్ ఛేజ్‌లో నేపాల్ విఫలం
భారీ టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయగలిగింది. దాంతో కేవలం 4 పరుగుల తేడాతో నేపాల్‌కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో మరొక్క బౌండరీ వచ్చింటే ఈ టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదయ్యేదే. అయితే అనుభవలేమి నేపాల్ కు మ్యాచ్ దూరం చేసింది. ఇంగ్లాండ్ తరఫున లియామ్ డాసన్ 2 వికెట్లు తీశాడు. ల్యూక్ వుడ్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌లలో పెద్ద జట్లు అతికష్టమ్మీద విజయాలు సాధించాయి. నేపాల్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెమటలు పట్టించారు.

















