Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
Gottipati Ravi Kumar | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సిట్ నివేదికలో తేలిందని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి టీడీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు.

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరుగుతోందని తెలిసినా నేతలు పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. నాలుగు నివేదికలు తిరుమల లడ్డూ కల్తీపై స్పష్టం చేసినా వైసీపీ నేతలు అపచారం చేయలేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
తరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని, రసాయనాలు వాడినట్లు సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. దాంతో లడ్డూ కల్తీపై వైసీపీ, అధికార కూటమి నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ కల్తీని అరికట్టాల్సింది పోయి, నేరాన్ని కప్పిపుచ్చి అవే సంస్థలకు టెండర్లు కొనసాగించడం కేవలం ముడుపుల కోసమేనని ఆరోపించారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి నిబంధనలను సడలించి మరీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
2022లోనే కల్తీని నిర్ధారిస్తూ సీఎఫ్‌టీఆర్‌ఐ (CFTRI) నివేదిక ఇచ్చినా బయటపెట్టకుండా తొక్కిపెట్టారు. ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డూ కల్తీని ప్రోత్సహించారు. స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఒకటి రెండు కాదు, ఏకంగా 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని’ ఛాలెంజ్ చేశారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వెనుక చాలా మంది ఉన్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన గొట్టిపాటి.. ఆ పని చేసిన వ్యక్తులు ఎవరో ఆయనే బయటపెట్టలన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మహాపచారం తలపెట్టిన వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని హెచ్చరించారు. కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
సుబ్బారెడ్డి నిజం ఒప్పుకున్నా జగన్ వితండవాదం..
విశాఖపట్నం: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగినట్లు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారని, కానీ జగన్ మాత్రం కల్తీ జరగలేదని వితండవాదం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో పల్లా మాట్లాడారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసి, దాంతో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేయడం దారుణం అన్నారు. డబ్బుకు కక్కుర్తిపడి కోట్లాది హిందువుల మనోభావాలను వైసీపీ నేతలు తాకట్టుపెట్టారు. కల్తీ నెయ్యి వాడకంలో ప్రధాన సూత్రధారులపై చర్యలు తప్పవు. దమ్ముంటే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి తరుమల లడ్డూ కల్తీపై చర్చించాలి. తాము చేసిన అపచారానికి భక్తులకు క్షమాపణ చెప్పాలని’ పల్లా శ్రీనివాసరావు అన్నారు.
























