ఈ ఏడాది భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని కారణంగా రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Chandrababu About El Nino Impact | రాష్ట్రంలో ఎల్‌నినో వల్ల 35.5 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. అన్నిచోట్లా వరి వేయకూడదని రైతులకు సీఎం చంద్రబాబు సూచించారు.

- రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై సీఎం ఆందోళన.
- గోదావరి బేసిన్ మినహా వరి సాగు వద్దు, ప్రత్యామ్నాయ పంటలకు సూచన.
- ఈ ఏడాది 35.5% లోటు వర్షపాతం అంచనా, జల సంరక్షణకు పిలుపు.
- కృష్ణా, పెన్నా బేసిన్ ప్రాజెక్టులకు నీటి లభ్యత తీవ్ర ఆందోళనకరం.
అమరావతి: ఈ ఏడాది భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు నెల సగం పూర్తయినా లోటు వర్షపాతం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో తీవ్ర ప్రభావం, నీటి సంక్షోభంపై మాట్లాడుతూ ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారని రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి లభ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాత పరిస్థితుల కారణంగా రైతులు అన్ని ప్రాంతాల్లో వరి వేసి ఇబ్బంది పడొద్దని సూచించారు.
గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి వద్దు!
గోదావరి నదికి మాత్రమే కొంత వరద నీరు వస్తోందని తెలిపారు. కనుక గోదావరి బేసిన్ మినహా మిగిలిన ఏ ప్రాంతంలోనూ వరి పంటలు వేస్తే, పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గ్రహించి నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పెన్నా బేసిన్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 42 శాతానికి చేరిందన్నారు.
నీటి కొరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు
నీటి కొరత వల్ల రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా వర్షపాతం తగ్గడంతో అక్కడి రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని తెలిపారు. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం భారీగా తగ్గిందని ఆయన వివరించారు. ఉదాహరణకు శ్రీశైలానికి సాధారణంగా రావాల్సిన 753 టీఎంసీల నీటికి గాను ఈ ఏడాది కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తెలిపారు.
జూన్ నుంచి డిసెంబర్ మధ్య సాధారణంగా పడాల్సిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 557 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జులై నుంచి నవంబర్ వరకు 20 శాతం నుండి 68 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని, డిసెంబర్‌లో మాత్రమే స్వల్పంగా సాధారణ వర్షపాతం ఉండవచ్చని వివరించారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని.. కొన్ని జిల్లాల్లో జులైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్ నెలలో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనాలు వివరించారు. నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Frequently Asked Questions
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులకు ప్రధాన కారణం ఏమిటి?
లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులు వరి సాగు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు?
గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి పంటలు వేస్తే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదని సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరతకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి?
తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమలకు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఎం తెలిపారు. నీటి కొరత వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎంత శాతం లోటు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా?
నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుంది. కొన్ని జిల్లాల్లో ఇది 42 శాతానికి చేరవచ్చని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















