Weight Loss: బరువు తగ్గాలా? మధ్యాహ్నం ఇన్ని గంటల లోపు లంచ్ చేస్తే ఊహించని ఫలితం
సమయం ప్రకారం ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని అంటున్నారు నిపుణులు.
పనిలో పడి చాలా మంది సమయానికి తినరు. లంచ్ చేయాల్సిన టైంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. స్నాక్స్ తినే టైంలో లంచ్ చేస్తారు. ఇక మరి కొంతమంది మరీ దారుణంగా అర్థరాత్రి డిన్నర్ చేస్తారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం చేకూరుతుంది. గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇదే కాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా పలకరిస్తాయి. జీవగడియారం మొత్తం తలకిందులు అయిపోతుంది. దాని వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మధ్యాహ్నం 3 గంటల్లోపు లంచ్ పూర్తి చెయ్యాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే బరువు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అనేక మందిపై చేసిన పరిశోధనలో ఇది తేలింది. 14 వారాలు పాటు ఖచ్చితమైన సమయాల్లో వారికి భోజనం పెట్టారు. సమయానికి భోజనం చేసిన వ్యక్తులు 2.5 కేజీలు తగ్గినట్టు పరిశోధనలో తేలింది. ఇదే కాదు రక్తపోటు, మానసిక పరిస్థితిలో కూడా మార్పులు గమనించారు. బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్శిటీ ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో కొంతమంది వారానికి రెండు సార్లు ఉపవాసం కూడా చేయించారు. తినే టైమ్ ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చారు. ఇలా చేయడం వల్ల శరీరం, మెటబాలిజంలో కూడా మార్పులు జరిగి కొవ్వు కరిగిపోవడం జరిగినట్టు గుర్తించారు.
ఈ అధ్యయనంలో 90 మంది ఊబకాయం ఉన్న వారిని తీసుకున్నారు. వాళ్ళని రెండు భాగాలుగా విడగొట్టి సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమయానికి ఇస్తూ సుమారు 150 నిమిషాల పాటు వ్యాయామం కూడా చేయమని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు తినే వారిలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువ సేపు ఉంటున్నాయి. కేలరీలు కూడా కరిగిపోయాయి. వారిలో సగం మందికి ఉపవాసం చేయమని కూడా చెప్పారు. 14 వారాల పాటు 6 సార్లు ఉపవాసం చేయమన్నారు. వారిలో కూడా సత్ఫలితాలు కనిపించాయి.
ఇంకొక అధ్యయనం ప్రకారం తక్కువ కేలరీలు తీసుకోవడం కంటే సమయం ప్రకారం తినడం ఉత్తమమైన మార్గమని ఖచ్చితంగా చెప్పలేమని మరి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయినా సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఊబకాయం సమస్య రాకుండా ఉంటుంది. మితమైన కేలరీలు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని అన్నారు. ఆహారంలో మార్పులే కాకుండా శారీరక శ్రమ కూడా అవసరం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే హాయిగా నిద్ర కూడా పడుతుంది. మళ్ళీ ఉదయం లేవగానే ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉంటారు. రాత్రి భోజనం 8 గంటల్లోపు తీసుకోవాలి. అలా చేస్తే తిన్న ఆహారం అరుగుదలకి ఎటువంటి అడ్డంకులు ఉండవు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి
Also read: ఈ ఐదు పండ్లు మీ అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసేస్తాయ్