మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? జాగ్రత్త, ఈ జబ్బులొస్తాయ్!
మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? అయితే, మీరు కొత్త వ్యాధులను ఆహ్వానిస్తున్నాట్లే.
బిజీ లైఫ్‌లో ఊపిరి పీల్చుకోడానికి టైమ్ ఉండటం లేదు. చివరికి టాయిలెట్‌కు వచ్చినా వాయిదా వేసుకొనే పరిస్థితి. చాలామంది మల, మూత్ర విసర్జనలకు వెళ్లకుండా బలంగా ఆపుకుంటారు. ముఖ్యమైన పనిని పూర్తి చేసుకుని వెళ్దాంలే అని అనుకుంటారు. అయితే, ఆ అలవాటు మిమ్మల్ని భవిష్యత్తులో కష్టాలపాలు చేస్తుందనే సంగతి మీకు తెలుసా? వ్యాధులతో ముప్పు తిప్పలు పెడుతుందని తెలుసా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవల్సిందే.
సమయం లేదనో, అవకాశం లేదనో.. కారణం ఏదైనా సరే ఎప్పుడూ మల విసర్జనను వాయిదా వెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు. పనులు అయ్యే వరకు విసర్జనను వాయిదా వేస్తే మాత్రం మీరు అనారోగ్యం పాలవుతారని తెలుపుతున్నారు. టాయిలెట్ కు వెళ్లడాన్ని వాయిదా వెయ్యడం వల్ల పేగులు బలహీన పడతాయని హెచ్చరిస్తున్నారు.
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. టాయిలెట్ అవసరం ఒకొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మంది రోజుకు రెండు మూడు సార్లు వెళితే, మరికొందరు మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా వెళ్లొచ్చు. ఈ సమయం మీరు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు గ్రహించి.. మిగిలిన వ్యర్థాలను బయటకు పంపేందుకు తీసుకునే ప్రయాణ కాలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంతసేపు అనేది పేగుల్లోని కదలికలపై ఆధారపడి ఉంటుంది.
ఈ అలవాటు వల్ల మీరు ఒక్కోసారి వెంట వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సిన అవసరం రావచ్చు. లేదా డయేరియా, మలబద్దకం వంటి సమస్యలను కూడా ఫేస్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పేగుల కదలికల్లో కలిగే తేడాల వల్లే అని నిపుణులు చెబుతున్నారు. రెండు మల విసర్జనల మధ్య సమయం సాధారణ పరిస్థితుల్లో 8 నుంచి 24 గంటల సమయం ఉంటుంది.
ఎన్నో సమస్యలు వెంటాడుతాయ్
పిల్లలుగా ఉన్నపుడు పెద్దగా టాయిలెట్ ను వాయిదా వేయ్యాల్సిన అవసరం ఉండదు. ఆ జ్ఞానం కూడా ఉండదు. కానీ టాయిలేట్ ట్రైనింగ్ అలవాటైన తర్వాత ఆపుకోవడం నేర్చుకుంటాం. అది తప్పదు, ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉండే ప్రతిసారి మనం టాయిలెట్‌కు వెళ్లడం కష్టం. ఆఫీసు పనుల్లోనో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు అది మరింత ఇబ్బంది. నిజానికి మల విసర్జన ఆపుకోగలగడం పిల్లల ఎదుగుదలలో ఒక భాగం. అలా నేర్చుకున్న దాన్ని పెద్దయ్యే కొద్ది చాలా ఎక్కువగా వాడేస్తుంటారు. కొంతకాలం అలా ఆపుకుంటూ పోతే.. మల విసర్జన వాయిదా వెయ్యడం సాధ్యమే. కానీ, అదే అలవాటుగా మారితే.. మలబద్దక సమస్య, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ చేరడం, పేగుల్లో కదలిక తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
వాయిదా వేయడం చాలా ప్రమాదం
మల విసర్జనను వాయిదా వెయ్యకూడదని, ముఖ్యంగా పేగుల్లో కదలికలు తక్కువగా ఉండి.. రెండు రోజులకు ఒకసారి మల విసర్జనకు వెళ్లే వాళ్లు అసలు ఆపుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి.. తీసుకున్న ఆహారంలో మిగిలిపోయిన వ్యర్థాలు శరీరంలో ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండడం అంత మంచిది కాదు. ఎక్కువ సమయం పాటు నీరు, బ్యాక్టీరియా, కార్బోనెట్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, లిక్విడ్లు శరీరంలో ఎక్కువ సమయం పాటు ఉంటే అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు మెటబోలైట్స్ అనే రసాయనాలు కూడ ఇందులో ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగుల్లో తిరిగి శోషించబడి కొలోనిక్ పాలిప్స్, హెమరాయిడ్స్ కి కారణం అవుతాయి. కనుక మలబద్దకం ఏర్పడకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.
ఇలా చేస్తే సేఫ్
ఆహారంలో ద్రవ పదార్ధాలు, ఫైబర్ కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చెయ్యడం ద్వారా కూడా బవెల్ హాబిట్స్ ను సరిచేసుకోవచ్చు. అంతేకాదు కొంత మంది పేగుల పనితీరును మెరుగు పరిచేందుకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని కూడా ఉపయోగిస్తున్నారట. అన్నింటి కంటే ముఖ్యం మీకు ప్రకృతి నుంచి వచ్చే పిలుపును నిర్లక్ష్యం చెయ్యకూడదు. వీలైనంత వరకు నేచర్ కాల్ రాగానే స్పందించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.